17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌

రాష్ట్రపతి ఎన్నికలలో పెద్ద ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగింది. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన పార్టీలకు చెందిన  17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మకు వోట్ వేశారు.  అసోం, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌కు  పాల్పడినట్లు వెల్లడైనది.

అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్‌లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. బీజేపీ ఏమో ఆ సంఖ్యను 18 రాష్ట్రాల నుంచి 126 ఎమ్మెల్యేలుగా చెబుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు.

ముర్ముకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన జేఎంఎం ఇతర  ఎన్డీయేతర పార్టీల ఓట్లు వీటికి అదనం. అయితే, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి సొంత రాష్ట్రాల్లో కూడా దక్కనన్ని ఓట్లు అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్‌లో దక్కాయి. ఇక్కడ వంద శాతం మంది ప్రజా ప్రతినిధులు ముర్ముకే ఓటేశారు. చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్‌, సిక్కింలలో మాత్రమే బీజేపీ ఇలా వంద శాతం ఓట్లు దక్కించుకుంది.

తెలంగాణ, కేరళ, పంజాబ్‌, ఢిల్లీల్లో ప్రధాన పార్టీలు రెండూ ముర్ముకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్డీయేకు అతి తక్కువ ఓట్లు దక్కాయి. ముర్ము తిరుగులేని విజయంతో కంగుతిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దాంతో ఉప రాష్ట్రపతిగా బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ విజయం నల్లేరుపై నడకగా మారింది.

మూడో రౌండ్‌లో విజయం ఖాయం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘130 కోట్ల మంది భారతీయులు ఆజాదీగా అమృతోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో భారత దేశం చరిత్ర సృషించింది. తూర్పు భారతంలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా ఎన్నుకుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

పార్టీలకు అతీతంగా ముర్ముకు మద్దతు తెలిపి రికార్డు స్థాయి విజయానికి దోహదం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌ గవర్నర్‌గా ఆమె పదవీకాలం అద్భుతంగా సాగిందని కొనియాడారు. రాష్ట్రపతిగా కూడా ఆమె అద్భుతంగా పని చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశంలోని గిరిజన తెగలన్నింటిలో అతిపెద్దదైన సంథాల్‌ తెగలో జన్మించడం ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి పదవిని తెచ్చిపెడితే ఆమె విజయం వచ్చే రెండేళ్ల వ్యవధిలో జరిగే గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో తమకు ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు.

ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా మోదీ ఎన్డీయే, యూపీఏ కూటములకు దూరంగా ఉన్న బీజేడీ, వైసీపీ, అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్‌, అకాలీదళ్‌ మద్దతును కూడగట్టగలిగారు. చివరకు యూపీఏ కూటమిలో ఉన్న జేఎంఎం కూడా ముర్ముకే మద్దతు పలికింది. ఆంధ్రప్రదేశ్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ముర్ముని రాష్ట్రపతిని చేయడం ద్వారా ఏపీ గిరిజన ప్రాంతాల్లో పాగా వేయవచ్చని ఆశిస్తోంది.