భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయకేతనం

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సంతాల్‌ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలను రెట్టింపు చేశారు.

స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు.అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ఘన విజయం సాధించారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిభా పాటిల్‌ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమె ప్రతి రౌండ్‌లోనూ ఆధిపత్యంలో కొనసాగారు. ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి.

2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు. 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు. గిరిజన బిడ్డ అయిన ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది.

 అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్‌లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్‌లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేయడం విశేషం! కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి. ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, శివసేన, ఆప్,  జేఎంఎం సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు.
ద్రౌపదీ ముర్ము విజయం సాధించడం తో ప్రధాని నరేంద్ర మోదీ  స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు అందజేశారు. ముర్ముకు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్చం అందజేశారు. ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారని, దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలుపుతారని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీతోపాటు ముర్ము నివాసానికి వెళ్లారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు.

ఓటమి అంగీకరించిన యశ్వంత్ సిన్హా స్పందిస్తూ తాను శ్రీమతి ద్రౌపది ముర్మూను మనసారా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆమె దేశ 15వ రాష్ట్రపతిగా రాజ్యాంగ పరిరక్షకురాలుగా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా గమ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలతో పాటు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు.

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్,  ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ద్రౌపదీ ముర్ము కు మద్దతు తెలిపిన పార్టీలు సైతం ఆనందంలో ఉన్నాయి.