ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 100  విద్యాసంస్థలకు బుధవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. మయూర్‌ విహార్‌లోని మదర్‌ మ్యారీ స్కూల్‌, ద్వారక, వసంతకుంజ్‌ల్లోని డిల్లీ పబ్లిక్‌ స్కూళ్లు, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్‌, సాకేత్‌లోని అమిటీ స్కూళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బుధవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
 
దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా పిల్లలను బయటకు పంపించారు. వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని బెదిరింపు ఘటనలపై వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.  
 
మయూర్ విహార్​లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని దిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాల, వసంత్ కుంజ్‌ లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, సాకేత్‌ లోని అమిటీ పాఠశాల యాజమాన్యానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి.
స్కూళ్ల యాజమాన్యానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అన్ని స్కూళ్లకు మెయిల్స్ ఒకే ఐడీ నుంచి వచ్చాయి. స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని కనుక్కొనేందుకు దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ సహా భద్రతా ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి.
 
ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్వేషణ కొనసాగుతోంది. అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదు. ‘బుధవారం వేకువజామున 4 గంటల 15 నిమిషాలకు ఒకే ఈ-మెయిల్ ఐడీ నుంచి దిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మాకు సమాచారం అందిన వెంటనే స్కూళ్లను మూసివేయాలని యాజమాన్యాలను ఆదేశించాం. విద్యార్థులను తిరిగి ఇంటికి పంపించాం. పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాం’ అని ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ రోహిత్ మీనా తెలిపారు.

ఢిల్లీలోని ఎన్ సీఆర్ పరిధిలోని ఆరు స్కూళ్లు బాంబు బెదిరింపులు రావడంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఇవన్నీ బూటకపు ఈ-మెయిల్స్ అని తెలిపింది. ఈ బెదిరింపులపై దిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని పేర్కొంది.

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. బడుల్లో బాంబును గుర్తించలేదని తెలిపారు. అవసరమైన చోట పాఠశాలల అధికారులు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ మెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో(రష్యా) ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుడి వివరాలు తెలుసుకుంటామని చెబుతున్నారు.

మరోవైపు పాఠశాలల్లో బాంబు బెదిరింపులపై తనకు వివరణాత్మక నివేదిక అందించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్​ను ఆదేశించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. స్కూళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.