ఏపీలో ప్రభుత్వం నియంత్రణలోకి సినిమా వ్యాపారం!

ఏపీ అసెంబ్లీ బుధవారం ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించిన ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్ టాలీవుడ్ కు పెద్ద కుదుపు ఇచ్చిన్నట్లు అయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ లతో సినిమాలు తీస్తున్న వారిని కట్టడి చేసిన్నట్లు అయింది. సినీ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి పరిస్థితులు ఏర్పడగలవాని కలవరం చెందుతున్నారు. 

ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్ లో ఇకనుంచి టికెటింగ్ కు అనుమతి లేదు. ఒక విధంగా సినిమా వ్యాపారం ప్రభుత్వం చేతిలో చిక్కుకున్నట్లయింది. టాలీవుడ్ కు గుండెకాయ వంటి ఏపీలో ఇటువంటి నియంత్రణ తీసుకు రావడం అశనిపాతంగా భావిస్తున్నారు. 

టూకీగా చెప్పాలంటే ఇక నుండి నో బెనిఫిట్ షోస్, నో ఎక్స్‌ట్రా షోస్, నో టికెట్ హైక్స్.. కేవలం నాలుగంటే నాలుగే ఆటలు. టికెట్లను కూడా ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్ముతుంది.

మొదటి నుండి సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును సినీ పెద్దలు వ్యతిరేకిస్తూనే వచ్చారు. మధ్యలో కొందరు నిర్మాతలు వెళ్లి  మంత్రి పేర్ని నానితో మాట్లాడి,  ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నామని ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇప్పుడు తీరా బిల్లును ప్రవేశ పెట్టాక సినీ  వర్గాలు షాక్ కు గురయిన్నట్లు కనిపిస్తున్నది. 

‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వ ఆన్‌లైన్ టికెటింగ్‌ విధానంపై, టికెట్ల ధరలపై జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడినప్పుడు టాలీవుడ్ నుండి పెద్దగా ఆయనకు మద్దతుగా ముందుకు రాలేదు. పైగా పలువురు ప్రముఖులు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అంటూ ఏపీ మంత్రిని కలసి వివరణ కూడా ఇచ్చుకున్నారు. 

ఆనాడు పవన్ కళ్యాణ్ కు కొద్దిమంది మద్దతు పలికినా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఇటువంటి బిల్లు తీసుకొచ్చే సాహసం చేసిదిది కాదని అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతున్నది.  

పైగా,  రాష్ట్రంలో అనేక సమస్యలుండగా, నిత్యావసర ధరలు మండిపోతున్న తరుణంలో, కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమైన సమయంలో  వాటిపై దృష్టి పెట్టకుండా సినిమా టికెట్లపై పట్టుదలగా వ్యవహరించడం సినీ వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది. 

పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనప్పుడు,  కేవలం ఏపీలోనే ఎందుకు సమస్యలు లేవనెత్తుతున్నారో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. తగు సదుపాయాలు కల్పిస్తే ఏపీలో విశేషంగా సినిమాలు తీస్తామని అంటూ సినీ ప్రముఖులు స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుండి ఈ విషయంలో ఎటువంటి ఆసక్తి కనబడటం లేదు. 

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రస్తుత చట్టం కారణంగా థియేటర్ వ్యవస్థ కూలిపోయి, సినీ నిర్మాతలు ఎక్కువగా ఒటిటి వేదికలపై ఆధారపడి పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.