పెట్రోల్ తో పోటీపడుతున్న టమాటో ధరలు 

దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలతో ఒక వంక ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉంటె, మరోవంక దానితో పోటీ పడుతున్నట్లుగా  టమాటో ధరలు పెరుగుతూ ఉండడం కలకలం రేపుతున్నది. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 అమ్మే టమాటాల ధర ఇప్పుడు చుక్కలను తాకుతోంది. రూ 100కు మించి పోతున్నది. 

ఈ మధ్యనే భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ 101గా ఉండగా, టొమోటోలు రూ 140 నుండి రూ 150 వరకు పలుకుతున్నాయి. దానితో ఒక కిలో టమోటాలు తెస్తే, ఒక కిలో బిర్యానీ ఉచితం అంటూ చెన్నై శివారులోని ఒక హోటల్ ప్రకటన ధరల తీవ్రతను వెల్లడిస్తున్నది. 

తమిళనాడులోనే కాదు. దేశంలో అనేక నగరాలలో పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. దేశంలో అత్యధికంగా టమోటాలను పండించే ఆంధ్రప్రదేశ్ లో సహితం రూ 100 వరకు ధర పలుకుతున్నది. ఏపీలో ప్రతి ఏడాది 26.27 లక్షల టన్నుల టమోటాలను పండిస్తున్నారు. కేరళలో సహితం కిలో టమేటా రూ 120 వరకు ధర  పలుకుతుండగా,దేశ రాజధానిలో రూ 90 నుండి రూ 110 వరకు ధర పలుకుతున్నది. 

టమేటా ధరలు అక్టోబర్ నుండి పెరుగుతూ నవంబర్  లో మండిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. మొదటగా అకాల వర్షాలు, వరదలతో పంట పాడైపోవడం, మరోవంక పెట్రోల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరగడం. ఇదే సమయంలో ఇది పండుగలు, వివాహాల సీజన్లో కావడంతో టమేటాలకు డిమాండ్ పెరగడం కూడా కారణం అవుతున్నది. 

గుంటూరులో కిలో టమాటా సెంచరీకి చేరింది. సూపర్‌ మార్కెట్లలో దీని ధర రూ.100 వరకు ఉండగా, ఆన్‌లైన్‌ స్టోర్లలో రూ.130 వరకు ఉంది. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కిలో ధర రూ.వంద దాటేసింది. 

చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో అయితే కేజీ రూ.150 దిశగా పరుగులు పెడుతోంది. మంగళవారం ఇక్కడ రికార్డు స్థాయిలో కేజీ ట‌మాటా ధర రూ.130 పలికింది. ఈనెల ఆరంభంలో కేజీ రూ.40 ఉన్న టమాటా ఇప్పుడు ఏకంగా రూ.130కి ఎగబాకింది.  క్యాప్సికం, ఉల్లిపాయలతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి.

నెల్లూరు, విజయవాడతో పాటు తమిళనాడుకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కలకడ, పలమనేరు ప్రాంతాల నుంచి, కర్ణాటకలోని కోలారు నుంచి టమాటాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. తుఫాను ప్రభావంతో పంట నష్టపోయి దిగుబడి తగ్గిపోవటంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాటా ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు నెలకొన్నాయి.

 పండిన పంటకు అనూహ్యమైన ధర లభించడంతో రైతుల ముఖాల్లో సంతోషాన్ని నింపుతున్నా,  సామాన్యులకు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.  తమిళనాడులో రూ. 150 కు కిలో టమోటా  అమ్ముతున్నారు. దీంతో అక్కడ కూడా టమోటాలు కొనడం జనం మానేశారు.  చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు కిలో టమాటాలు తీసుకొస్తే, అందుకు బదులుగా ఒక కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని సంచలనం కలిగిస్తున్నది.

చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే, వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని కూడా  ఆఫర్ చేశారు. భారత దేశంలో టమోటాలను ఎక్కువగా పండించే ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ లలో పంటలు పండించే కాలం కావడంతో, పంట మార్కెట్ కు వస్తే ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ లోనే అత్యధికంగా టమోటాలు పండుతుంటాయి.