ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు
విదేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని పెంచుతోంది. దీనిలో భాగంగా అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాల్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న ఈ20 స్టాండర్డ్ ఇథనాల్ కంటే ఎక్కువ ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తొలగించారు.
22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు కూడా ఈ ఎక్సైజ్ సుంకం వర్తిస్తుందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించినట్లు జూన్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గత మార్చి చివర్లో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. 
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రికత్తల కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ. 21.5, విమాన ఇంధనం ఎగుమతులపై లీటర్‌కు రూ. 29.5 చొప్పున కేంద్రం సుంకాలు విధించింది.  ఇదే విషయంపై అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ చేశారు.
పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ. 10 చొప్పున తగ్గించామని ఆమె పేర్కొన్నారు. అయితే, మే 15 నుంచి భారత్‌లో చమురు కంపెనీలు నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచాయి.  మే 25న చివరిసారిగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీజిల్ ధరను లీటర్‌కు రూ. 2.71, పెట్రోల్ ధరను లీటర్‌కు రూ. 2.61 చొప్పున పెంచాయి. మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు మొత్తం కలిపి లీటర్‌కు సుమారు రూ. 7.5 వరకు పెరిగాయి.