దేశ సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ఉద్దేశించిన పలు కీలక ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన దాదాపు రూ.4.51 లక్షల కోట్ల భారీ వ్యయంతో కూడిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. రైతులకు నిరంతర ఆర్థిక భరోసా కల్పించే పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇందుకోసం రూ.3,15,614 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ కేంద్ర ప్రాయోజిత పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2000 చొప్పున మొత్తం జమ చేస్తున్నారు.
‘పీఎం కిసాన్’ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో మొత్తం 4.47 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ పథకం అమలుపై నీతి ఆయోగ్ జరిపిన అధ్యయనంలోదాదాపు 92 శాతం మంది లబ్ధిదారులు ఈ నగదును నేరుగా వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగిస్తున్నారని, తద్వారా 85 శాతం మంది రైతుల వ్యవసాయ ఆదాయం మెరుగుపడటమే కాకుండా అప్పుల కోసం ఇతరులపై ఆధారపడటం కూడా తగ్గిందని వెల్లడైంది.
ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘సూర్య సరోవర్ యోజన’
పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రూ.5,070 కోట్లతో ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలాశయాలు, పారిశ్రామిక చెరువులపై సోలార్ ప్లాంట్ల నిర్మాణమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని 5,000 మెగావాట్లకు పెంచనున్నారు.
10,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2026-27 నుంచి 2030-31 వరకు ప్రాజెక్టులను అమలులోకి తీసుకురానుండగా, 2032-33 వరకు కేంద్రం ఆర్థిక సహకారం అందించనుంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఒక్కో ప్రాజెక్టుకు 50 లక్షల వరకు, అలాగే నిర్మాణ దశలో ప్రతి మెగావాట్‌కు కోటి చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం చేయనుంది.
ఈ పథకం ద్వారా ఏటా సుమారు కోటి టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. దాదాపు 16,000 నుంచి 17,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించడమే కాకుండా దేశీయ సోలార్, బ్యాటరీ తయారీ రంగానికి భారీ ఊతం లభించనుంది.

More Stories
‘సముద్ర మంథన్’కు రూ 84,084 కోట్లు కేటాయింపు
ఇథనాల్ లేకుంటే లీటర్ పెట్రోల్ ధర రూ.125?
ఈ20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు