భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ప్రవాస భారతీయులకు తమ విదేశీ కరెన్సీ పొదుపును సురక్షితంగా, గరిష్ట లాభాలతో పెంచుకోవడానికి ఇప్పుడు అద్భుతమైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్ సిఎన్ఆర్(బి)) డిపాజిట్ల కోసం ఒక ప్రత్యేక స్వాప్ విండోను ప్రవేశపెట్టింది.
ఇది ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐలకు) ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని అందించనుంది. ఎఫ్ సిఎన్ఆర్(బి) డిపాజిట్ అనేది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా. దీనిలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) తమ డబ్బును విదేశీ కరెన్సీలలో ఉంచుకోవచ్చు. ఈ కొత్త చొరవ, ఈ డిపాజిట్లతో ముడిపడి ఉన్న నష్టభయాలను నిర్వహించడానికి బ్యాంకులను ఈ స్వాప్ విండోను ఉపయోగించుకునేలా అనుమతిస్తుంది. దీనికి అయ్యే హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బిఐ భరిస్తుంది.
ఆర్‌బీఐ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో, దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మూడు నుండి ఐదు సంవత్సరాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 200 బేసిస్ పాయింట్లకు పైగా పెంచి 6%కి చేర్చింది. యెస్ బ్యాంక్ ఇంకా అధికంగా 6.5-6.6% అందిస్తోంది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక శాతంలో వందవ వంతు.
సాధారణంగా ఎన్నారైలు యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో, ఆస్ట్రేలియన్ డాలర్ వంటి విదేశీ కరెన్సీలను ఈ ఖాతాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సాధారణ రూపాయి డిపాజిట్లతో పోలిస్తే దీనివల్ల ఉండే అతిపెద్ద లాభం ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఎంత పడిపోయినా సరే వారి అసలు, వడ్డీ వారు ఎంచుకున్న విదేశీ కరెన్సీలోనే భద్రంగా ఉంటాయి.
ఇటీవల ఆర్‌బీఐ ఒక కీలక ప్రక్రియను ప్రారంభించింది. 3 నుండి 5 సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్ సి ఎన్ ఆర్ (బి) డిపాజిట్లపై అయ్యే కరెన్సీ హెడ్జింగ్ ఖర్చులను సెప్టెంబర్ 30, 2026 వరకు ఆర్‌బీఐ స్వయంగా భరిస్తుందని ప్రకటించింది. దీనివల్ల బ్యాంకులకు రిస్క్ తగ్గడంతో, అవి ఎన్నారై ఇన్వెస్టర్లకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేయగలుగుతున్నాయి.కరెన్సీ మార్పిడి వల్ల వచ్చే నష్టాల నుండి పూర్తి రక్షణ లభిస్తుంది. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి భారతదేశంలో ఎలాంటి పన్ను ఉండదు. అసలు, వడ్డీ మొత్తాన్ని మీ దేశానికి పూర్తిగా, సులభంగా తిరిగి తీసుకెళ్లవచ్చు. గ్లోబల్ మార్కెట్లలో లభించే సాధారణ వడ్డీ రేట్ల కంటే ఇండియాలో చాలా ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి.
More Stories
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు
`టాటా’ను బెంగాల్ కు పెట్టుబడులతో రప్పించడం తొలి ప్రాధాన్యత
సగం కన్నా తక్కువ ధరకు యూరియా దిగుమతి