పెట్రోల్ బంక్ ల నుండి పెట్రోల్, డీజిల్ భారీ కొనుగోళ్లపై నిషేధం

పెట్రోల్ బంక్ ల నుండి పెట్రోల్, డీజిల్ భారీ కొనుగోళ్లపై నిషేధం
పెట్రోల్ బంక్ ల నుండి పెట్రోల్, డీజిల్ భారీ  కొనుగోళ్లపై  ప్రభుత్వం నిషేధం విధించింది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్ లెట్ల నుండి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని, వాటిని ప్రత్యేక సరఫరా మార్గాల్లోనే పొందాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక వినియోగదారుడికి గాని, ఒక వాహనానికి గాని రోజుకి 200 లీటర్లకు మించి డీజిల్ ను విక్రయించకూడదని రిటైల్ అవుట్ లెట్లను ఆదేశించింది. 
 
ఈ నిషేధం 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని, పరిస్థితులను అనుసరించి గడువును పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో నెలకొన్న అసాధారణ పెరుగుదలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశ్యమని ఉత్తర్వుల్లో పేర్కొంది.  పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన ధరలు భారీగా  పెరగడం, పారిశ్రామిక/వాణిజ్య, రిటైల్ వర్గాల మధ్య ధరల వ్యత్యాసం ఉండటం కారణంగా ఈ ఆంక్షలు విధించారు. 
 
అదేవిధంగా, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు సైతం రిటైల్ అవుట్‌లెట్ల నుండి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడంతో ఇటీవల ఇంధన విక్రయాల్లో పెరుగుదల కనిపించిందని ప్రభుత్వం పేర్కొంది.  పశ్చిమాసియా సంక్షోభం తరువాత పెరిగిన ఇంధన ధరల నుంచి సాధారణ వినియోగదారులను కాపాడటానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రిటైల్ ధరలను సర్దుబాటు చేయడంతో ఈ వ్యత్యాసం ఏర్పడింది. 
 
టెలికాం టవర్లు, విద్యుత్ ఉత్పత్తి, ఇతర ఫీడ్‌స్టాక్ అవసరాల కోసం డీజిల్‌ను ఉపయోగించే పరిశ్రమలు వంటి బల్క్ వినియోగదారులకు మార్కెట్ ధర వసూలు చేస్తుండగా, రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ధరలు ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ధరలలోని ఈ వ్యత్యాసం వల్ల పెట్రోల్, డీజిల్‌ను అధిక రేట్లుకు విక్రయించే ప్రైవేట్ రంగ అవుట్‌లెట్లలో అమ్మకాలు తగ్గిపోయాయి. 
 
ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్ పంపుల్లో అమ్మకాలు పెరిగాయి. భారీ కొనుగోళ్లు సైతం రిటైల్ కేంద్రాల వైపు మళ్లడంతో మే 27న బల్క్ విక్రయాల్లో దాదాపు 29 శాతం తగ్గుదల నమోదైందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో రిటైల్ కేంద్రాల్లో ఇంధన విక్రయాలు పెరిగినట్లు గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది. 
బల్క్ కొనుగోళ్లు, రిటైల్ కేంద్రాల్లో ఇంధన ధరల్లో వ్యత్యాసం అధికంగా ఉందని వెల్లడించింది. రిటైల్ కేంద్రాల కన్నా బల్క్ కొనుగోళ్లలో డీజిల్ పై లీటరుకు రూ.40 అదనపు ధర చెల్లించాల్సి వుందని పేర్కొంది.