మురుడేశ్వర్‌పై ఐసిస్‌ ఉగ్రవాదుల కన్ను!

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అరేబియా సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న హిందువులకు పవిత్రమైన  మురుడేశ్వర్‌పై ఐసిస్‌ ఉగ్రవాదుల కన్ను పడినట్టు సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆలయ పరిసరాలలో భద్రతను పెంచారు.

ఉత్తర కన్నడ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన మురుడేశ్వర్‌లో 123 అడుగుల ప్రసిద్ధ శివుని విగ్రహం ఒక సంచలనాత్మక ఉగ్రవాద సంస్థ  ప్రచురణలో కనిపించడంతో, ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నట్లు భావించవలసి వస్తున్నది. మురుడేశ్వర్ వద్ద ఉన్న శివుడి ఫోటో విగ్రహం నుండి దాని పుర్రె కత్తిరించినట్లుగా సవరించి చూపారు. దీనిని ఐఎస్‌ఐఎస్‌ వెబ్ సైట్ లో ప్రచురించారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు అన్షుల్ సక్సేనా అనే వ్యక్తి ఈ చిత్రాన్ని తన ఖాతాల్లో పోస్ట్ చేశాడు.

ఐఎస్‌ఐఎస్‌ అధికారిక పత్రిక ‘ది వాయిస్ ఆఫ్ హింద్’లో ఈ ఫోటోను ప్రచురించారు.  ‘వాయిస్ ఆఫ్ హింద్’ అనేది 2020లో ప్రారంభించిన  భారతదేశం గురించి నెలవారీ ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్. ఈ ప్రచురణలో గతంలో కొన్ని పోస్ట్‌లలో భారతదేశంపై దాడి చేసే లక్ష్యాలను వెల్లడిస్తూ వచ్చారు. 

చిత్రంతో పాటు, ‘అబద్ధ దేవుళ్లను విచ్ఛిన్నం చేసే సమయం వచ్చింది’ అంటూ  విగ్రహం పుర్రె ప్రాంతంలో జెండా రెపరెపలాడుతూ ఉండడాన్ని చూపారు. అధికారికంగా ఉన్న చిత్రంపై స్పష్టత లేనప్పటికీ, సక్సేనా తన పోస్ట్‌లలో, వెంటనే భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. 

పోలీసు శాఖ వెంటనే స్పందించలేదు. ఫోటో, ఇతర సమాచారం  వాస్తవికతను సంబంధిత శాఖ తనిఖీ చేయాలని పేర్కొంటూ  అపవిత్రత లక్ష్యంగా ఇటువంటి విధ్వంసానికి అనుమతించబోమని అంటూ పేర్కొన్నారు. .

 ఉత్తరకన్నడ జిల్లా భట్కళ్‌ తాలూకాలోని మురుడేశ్వర్‌కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు, భక్తులు విచ్చేస్తుంటారు. సముద్రతీర ప్రాంతం కావడంతో ఈ పుణ్యక్షేత్రానికి ఆదరణ అధికంగా ఉంది.  ఇక్కడి శివుడి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 

సోషల్ మీడియా పోస్ట్ తో ఉత్తరకన్నడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భట్కళ్‌లో గతంలో ఐసిస్‌ సానుభూతిపరులు అరెస్టయిన నేపథ్యంలో సహజంగానే ఈ వదంతులు కలకలం సృష్టిస్తున్నాయి. 

రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మీడియాతో మాట్లాడుతూ మురుడేశ్వర్‌ ఆలయ పరిసర ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి నిఘాను మరింతగా పెం చామని తెలిపారు. ఆలయం వద్ద అనుమానితులను గుర్తిస్తే తక్షణం అదుపులోకి తీ సుకోవాలని పోలీసులకు సూచించామని చెప్పారు. 

గంభీర్‌ కు ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌ బెదిరింపు 

భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ను   చంపుతామని ఐఎస్‌ఐఎస్‌ కశ్మీర్‌   నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్‌ రూపంలో తనకు బెదిరింపులు వచ్చాయని మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు. 

బెదిరింపులకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంపీ గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై తాము దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. 

గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. 15 ఏండ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన గౌతం గంభీర్‌ 2018లో రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.