ప్రస్తుత భారతీయ తల్లిదండ్రుల మారుతున్న ఆశయాలు దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి. పిల్లల విద్యావకాశాల కోసం, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా చాలామంది ఆధునిక జంటలు ఒకే బిడ్డను ఎంచుకొంటున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుండడం, పట్టణీకరణ, ఉపాధి విధానాల్లో మార్పుల కారణంగా ప్రస్తుతం సుమారు 70 శాతం మంది ప్రజలు విడివిడిగా(న్యూక్లియర్ ఫ్యామిలీస్) నివసిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చూపిస్తున్నాయి.
ఫలితంగా పిల్లలను పెంచడం తల్లిదండ్రులపై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నది. ఇది తక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా వారిని ప్రోత్సహిస్తున్నది. టీఎఫ్‌ఆర్ స్థాయి తగ్గడానికి మరొక ముఖ్యమైన కారణం సాంస్కృతిక మార్పు. గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టెలివిజన్ రాక వల్ల కొన్నేండ్లుగా గర్భధారణలు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొన్నది.
చిన్న కుటుంబాలను ప్రోత్సహించే మహిళలను చూపే టెలివిజన్ ధారావాహికలతో సంతానోత్పత్తి రేటు క్షీణత ముడిపడి ఉన్నదని నిఫుణులు అంటున్నారు. ఈ జనాభా మార్పు విభిన్న సామాజిక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కాలక్రమేణా, నిరంతర తక్కువ సంతానోత్పత్తి రేటుతో వృద్ధుల సంఖ్య ఎక్కువవుతుంది, శ్రామిక శక్తి తగ్గుతుంది. సామాజిక సంక్షేమ వ్యవస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
భారత్‌లో పరిస్థితిపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో అత్యంత విద్యావంతులైన వారిలో జననాల రేటు చాలా ఏండ్ల క్రితమే రీప్లేస్‌మెంట్ కంటే కిందికి పడిపోయిందని పేర్కొన్నారు. భారత్ లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని మీడియా సంస్థ ‘ఏఎఫ్ పోస్ట్’ షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ ‘ఎక్స్’ వేదికగా ఆయన పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో తొలిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు 2.1 పిల్లలు అనే ప్రతిస్థాపన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ‘ఏఎఫ్ పోస్ట్’ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలోనే ఈ రేటు 2.3 నుంచి 1.9కి క్షీణించిందని తెలిపింది. ఢిల్లీలో అయితే ఈ రేటు 1.2 కి పడిపోయిందని, ఇది ఫిన్‌లాండ్ కంటే కూడా తక్కువని నివేదిక పేర్కొన్నది.
ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2025’ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1.9 గా నమోదైందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువ అని స్పష్టం చేసింది
సంతానోత్పత్తి రేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రతి తరం మునుపటి తరం కంటే చిన్నదిగా మారి దేశ జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని నివేదిక విశ్లేషించింది. మరోవైపు దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రసూతి మరణాలు, లింగ వివక్ష వంటి సవాళ్లు ఉన్నాయని యూఎన్ఎఫ్‌పీఏ నివేదిక తెలిపింది.

More Stories
ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ జోజిలా బ్రేక్ త్రూ
ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో మందుల కొరత ఏర్పడే ప్రమాదం!
పవర్ టూల్స్ రంగంలో భారత ఆత్మనిర్భరత