ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్‌ టన్నెల్‌ జోజిలా బ్రేక్‌ త్రూ

ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్‌ టన్నెల్‌ జోజిలా బ్రేక్‌ త్రూ
భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో హిమాలయాల దిగువన  ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కాశ్మీర్, లడఖ్ మధ్య దశాబ్దాల నాటి సర్వకాలీన అనుసంధానత కల నెరవేరింది.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, ఆసియాలోనే అత్యంత పొడవైన రోడ్‌ టన్నెల్‌ జోజిలా బ్రేక్‌ త్రూ విజయవంతంగా పూర్తయ్యింది. 
జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత ప్రతిష్టాత్మక ‘జోజిలా టన్నెల్’ ప్రాజెక్ట్ ఫైనల్ బ్రేక్ త్రూను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టనెంట్ గవర్నర్  మనోజ్‌ సిన్హా, మేఘా ఇంజినీరింగ్‌ అధినేత కృష్ణారెడ్డి తదితరులు సొరంగ చేదానికి సంబంధించిన తుది పనులను మంగళవారం ప్రారంభించారు. దేశ మౌలిక వసతుల చర్రితలో జోజిలా టన్నెల్‌ బ్రేక్‌ త్రూ ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.
ఇది కేవలం రహదారి మాత్రమే కాదని లద్దాఖ్‌-జమ్ముకశ్మీర్‌ ప్రాంతాలకు జీవనరేఖ లాంటిదని పేర్కొన్నారు. బ్రేక్‌ త్రూ (సొరంగచేధం) తుదిఘట్టం తర్వాత బాల్తాల్‌- సోనామార్గ్‌ మధ్య 13.153 కిలోమీటర్ల పొడవైన సింగిల్‌ ట్యూబ్‌ టన్నెల్‌ తవ్వకం పూర్తయ్యింది.  భారత మౌలిక వసతుల రంగంలో ఇదో మైలురాయి. 2020 అక్టోబర్‌లో రూ.12 వేల కోట్ల అంచనాతో పనులు ప్రారంభం కాగా, కేవలం రూ.7 వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి కాబోతున్నది.  
దేశ రక్షణ రంగంతో పాటు పౌర రవాణాలో సరికొత్త విప్లవానికి ఈ ప్రాజెక్ట్ వేదికగా నిలిచింది. 2028 ఫిబ్రవరిలో ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ టన్నెల్‌తో ఏడాది పొడవునా రవాణా సాధ్యమవనున్నది.  శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌ వెళ్లాలంటే 13వేలకు పైగా అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను అధిగమిస్తూ, అత్యంత శీతల వాతావరణంలో 12 నుంచి 14 గంటల దాకా ప్రయాణించాల్సి ఉంది.
మరీ ముఖ్యంగా ఈ దారిలో సోనమార్గ్‌ దగ్గరున్న బాల్తాల్‌ నుంచి లద్దాక్‌లోని కార్గిల్‌ జిల్లా మీనామార్గ్‌కు 40 కిలోమీటర్లే దూరం. కానీ ఆ దారిలో ప్రయాణానికి దాదాపు 4 గంటలకు పైగా సమయం పడుతుంది.  మంచు కారణంగా ఈ రహదారి ఏడాదిలో సగం రోజులు మూతబడిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతుంటారు. లద్దాఖ్‌, లేహ్‌ ప్రాంతాలకు వెళ్లే వీలు లేక  పర్యాటకంపైనా ప్రభావం పడే పరిస్థితి. దేశ రక్షణలో కీలకమైన కార్గిల్‌-జోజిలా-ద్రాస్‌ ప్రాంతాలకు ఏడాది పొడవునా వెళ్లలేని దుస్థితి నెలకొంది. 
ఈ సొరంగం పూర్తిగా వినియోగంలోకి వస్తే బాల్తాల్‌ నుంచి మీనామార్గ్‌కు 27 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.  ప్రయాణ సమయం కూడా నాలుగు గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. అంతేకాదు, వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా సులభం అవుతుంది. సముద్ర మట్టానికి ఏకంగా 11,578 అడుగుల అసాధారణ ఎత్తులో నిర్మించిన ఈ సొరంగం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ‘అతి పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్’ టన్నెల్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రధాన సొరంగం పొడవు 13.153 కిలోమీటర్లు కాగా, అప్రోచ్ రోడ్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ పొడవు 30.894 కిలోమీటర్లుగా ఉంది. వెర్టికల్ షాప్ట్‌లు, నిల్‌గ్రార్‌ జంట సొరంగాలు, మంచు తాకిడిని తట్టుకునే ‘స్నో గ్యాలరీలు’ ఈ ప్రాజెక్ట్‌లో కీలక నిర్మాణాలుగా నిలిచాయి. గతంలో శీతాకాలంలో సంభవించే భారీ మంచు తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వల్ల జోజిలా పాస్ పూర్తిగా మూసుకుపోయేది.

ఫలితంగా లడఖ్ ప్రాంతం ఏటా దాదాపు ఆరు నెలల పాటు దేశంలోని మిగతా భాగాలతో సంబంధాలు తెగిపోయి బాహ్య ప్రపంచంతో తెంచుకుపోయేది. ఇకపై ఈ జోజిలా టన్నెల్ ద్వారా శ్రీనగర్ – లడఖ్ మధ్య ఏడాదిలో 365 రోజులూ నిరంతరాయంగా, సురక్షితంగా రాకపోకలు సాగించడం సాధ్యమవుతుంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ద్రాస్, కార్గిల్, లేహ్ వంటి వ్యూహాత్మక, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు ఈ టన్నెల్ ఒక రక్షణ కవచంలా మారనుంది.

శీతాకాలంలో కూడా భారత సైన్యాన్ని, భారీ యుద్ధ సామాగ్రిని, లాజిస్టిక్స్ సామగ్రిని ఎలాంటి ఆటంకాలు లేకుండా సరిహద్దులకు తరలించడానికి ఇది సైన్యానికి ఎంతో కీలకంగా మారనుంది. 13.153 కిలోమీటర్ల టన్నెల్‌ మార్గంలో రాతి స్వభావం 67 సార్లు మారడం ఇంజినీరింగ్‌ పరంగా క్లిష్టమైన సవాలుగా నిలిచింది. న్యూ ఆస్ట్రియన్‌ టన్నెలింగ్‌ పద్ధతి (ఎన్‌ఏటీఎం)లో ఈ టన్నెల్‌ను మేఘా నిర్మిస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో కోటి సురక్షిత మ్యాన్‌ అవర్స్‌ను సంస్థ ఇప్పటికే అధిగమించింది.

ఈ టన్నెల్ నిర్మాణ కాలంలో ప్రకృతి సృష్టించిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. మైనస్ 20 డిగ్రీల గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో సైతం 1200 మందికి పైగా కార్మికులు ఆధునిక పరికరాలతో రాత్రింబగళ్లు శ్రమించారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో 5 భారీ హిమపాతాలు సంభవించినా వెనుకడుగు వేయలేదు.  మూడేళ్ల కిందట భారీ హిమపాతంలో చిక్కుకున్న 172 మంది కార్మికులను భారత సైన్యం ప్రాణాలకు తెగించి సురక్షితంగా రక్షించింది.

టన్నెల్ తవ్వే మార్గంలో రాతి పొరల స్వభావం ఏకంగా 67 సార్లు మారినా, ఇంజనీర్లు పట్టుదలతో అధిగమించారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడం వల్ల లడఖ్ ప్రాంతంలో పర్యాటక రంగం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు అపూర్వమైన రీతిలో ఊపందుకోనున్నాయి.  స్థానిక ప్రజల దశాబ్దాల నాటి రవాణా కష్టాలు శాశ్వతంగా తీరిపోనున్నాయి.

వీటితో పాటు అమర్‌నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ఈ మార్గంలో ప్రత్యేక పార్కింగ్ ప్లేస్‌లు, అత్యవసర వైద్య సదుపాయాలు అధునాతన మౌలిక వసతులను కూడా కల్పించారు. ఇది కేవలం ఒక రహదారి లేదా సొరంగం మాత్రమే కాదు, అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులను సవాల్ చేస్తూ భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుత కట్టడం అని నిపుణులు కొనియాడుతున్నారు.