ఢిల్లీలో ఇంట్లోనే నాలుగురోజులుండి తిరిగి వచ్చిన కేసీఆర్ 

ఢిల్లీతో తాడో పేడో తెల్చుకుంటానన్న ముఖ్యమంత్రి  చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటనలో నాలుగు రోజులూ ఇంట్లోనే గడిపి తిరిగి వచ్చారు. ఆదివారం సాయంత్రం  ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి బుధవారం వరకు ఢిల్లిలోని తన నివాసమైన 23 తుగ్లక్ రోడ్ లోనే గడిపి, సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. 

రాష్ట్ర మంత్రులు, భారీ ప్రతినిధి వర్గంతో కలిసి ఢిల్లీలో నాలుగు  రోజులు గడిపారు. కానీ, చివరికి ధాన్యం సేకరణ విషయంపై ఏమీ తేల్చుకోకుండానే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ తిరుగుముఖం పట్టారు. దీంతోపాటు ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ అసువులు బాసిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. నాలుగు రోజులు అక్కడే ఉండి కూడా ఏ రైతు నేతనూ కలుసుకోవడానికి ప్రయత్నించలేదు. 

ప్రధానితో అపాయింట్‌మెంట్‌ లేదు.. హోంమంత్రి, ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం తీసుకోలేదు. దానితో ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతను కేంద్రంపై నెట్టేందుకు ప్రకటనలు ఇవ్వడం తప్పా, అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లలేదని స్పష్టం అవుతున్నది. 

వరి ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్న కేసీఆర్ ఎవరినీ కలవలేదు. మంగళవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి తోమర్ లతో కేవలం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. 

ప్రధానిని కలవడం కోసం ఎదురు చూపులు చూసారని కొన్ని మీడియా కధనాలు వచ్చినా,  ఆయన అసలు ప్రధానిని కలవాలని కోరనే లేదని తెలుస్తున్నది. ఒకరోజు ముందు కోరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ప్రధానిని కలవగలగడం గమనార్హం. 

రైతుల ఆందోళన కారణంగా సాగు చట్టాల రద్దు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఒక విధంగా ఆత్మరక్షణలో పడడంతో, దానిని ఆసరాగా తీసుకొని ఆయనను రైతు వ్యతిరేకంగా చిత్రీకరించి, తనపై రాష్ట్ర రైతాంగంలో వ్యక్తం అవుతున్న ఆగ్రవేశాలను దారిమళ్లించే `రాజకీయ ప్రయోజనం’ మాత్రమే ఆయన ఎత్తుగడలతో కనిపిస్తున్నది. 

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయినా మంత్రి కేటీఆర్‌ బృందం మంగళవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయానికి వెళ్లడం ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటలదాకా అక్కడే కాలక్షేపం చేశారు. 

ఆయన అమెరికా ప్రతినిధివర్గంతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, వీరిని కలుసుకొని పంపించారు. అయితే ఆయన ముందు వీరు ఎటువంటి కొత్త ప్రతిపాదనలు పెట్టక పోవడం గమనార్హం. గతంలో వ్యక్తం చేసిన డిమాండ్లనే మళ్ళి కేవలం ప్రచారం కోసం ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. 

కేంద్రం విధానం స్పష్టం చేసిన గోయల్ 

 కేంద్రం ఎంత మేరకు బియ్యం సేకరించగలదో ఈ నెల 26న స్పష్టత నిస్తామని   గోయల్‌ వారికి చెప్పారు. ప్రతి ఏడాది ఎంత కోటా ప్రకారం తాము బియ్యం కొనగలమో కూడా చెప్పగలమని, యాసంగిలో మాత్రం వరి పండించకుండా చూసుకోవాలని మరోమారు స్పష్టం చేశారు.  దేశంలో డిమాండ్‌, ఎగుమతి అవసరాలకు సరిపడా మాత్రమే వరి పండించాలని తాము భావిస్తున్నట్లు మరోసారి చెప్పారు. 

ఉప్పుడు బియ్యం నిల్వలు ఇప్పటికే నాలుగేళ్లకు సరిపడా తమ వద్ద ఉన్నందున.. మళ్లీ వాటిని కొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.  అయినా తెలంగాణలో ఉప్పుడు బియ్యం వినియోగం జరగడం లేదని గుర్తు చేశారు. పంజాబ్‌  గోధుమలు పండించే రాష్ట్రం కనుక అత్యధిక బియ్యాన్ని వినియోగించే తెలంగాణతో ఆ రాష్ట్రాన్ని పోల్చవద్దని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హితవు చెప్పారు. మిగతా రాష్ట్రాలన్నీ కేంద్రం విధానాన్ని గౌరవిస్తున్నప్పుడు తెలంగాణను ప్రత్యేకంగా చూడలేమని సున్నితంగా ధృడమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ఆరోగ్యం బాగాలేక  ఢిల్లిలోని ఎయిమ్స్ లో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు తప్ప  రాష్ట్ర సమస్యలపై కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇలా ఉండగా, కేసీఆర్ పట్ల కేంద్ర ప్రభుత్వం ధోరణిలో మార్పు వచ్చిన్నట్లు కూడా పలువురు భావిస్తున్నారు. కేసీఆర్‌ ఇంతకుముందు సెప్టెంబరులో రెండుసార్లు ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌, పీయూష్‌ గోయల్‌.. అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. 

అమిత్‌ షా అయితే విజ్ఞాన్‌ భవన్‌లో రెండు సార్లు కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరపడమే కాకుండా, తన నివాసంలో కూడా మంతనాలు జరిపారు. అయితే అటువంటి ఆసక్తి ఈ పర్యాయం కేంద్రంలో కనిపించక పోవడం గమనార్హం.