హైదరాబాద్ నుండి లడాఖ్‌కు బైక్ యాత్రకు బయలుదేరిన యువతి మెట్టు భాంధవికి హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలియజేసి, యాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసిస్తున్న మెట్టు భాంధవి హైదరాబాద్ నుండి లడాఖ్‌కు చేపట్టిన సాహసోపేత మోటార్‌సైకిల్ యాత్రకు బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
ముషీరాబాద్‌లోని కలాధర్ నగర్ కాలనీ అధ్యక్షులు మెట్టు వాసు, మెట్టు పద్మావతి దంపతుల కుమార్తె భాంధవి, తన కలల యాత్రగా భావిస్తున్న ఈ ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ వరకు నిర్వహించనున్నారు. “బైక్ అండ్ టూరింగ్ కంపెనీ”, “మ్యాడ్ ఓవర్ లడాఖ్” సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో 10 మంది రైడర్లు పాల్గొంటుండగా, హైదరాబాద్ బృందం నుంచి సుప్రియా, కార్తీక్, కైవల్య, మౌనిక, నవ్య, పల్లవి తదితరులు భాగస్వాములు కానున్నారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ “నేటి యువత కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. మెట్టు భాంధవి చేపట్టిన ఈ సాహస యాత్ర యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, ముఖ్యంగా యువతులు ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందుకు సాగగలరనే సందేశాన్ని సమాజానికి అందిస్తోందని పేర్కొన్నారు.
లడాఖ్ వంటి క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, ఎత్తైన పర్వత మార్గాలు, సవాళ్లతో కూడిన రహదారుల మధ్య ఈ యాత్రను చేపట్టడం భాంధవి సంకల్పబలం, పట్టుదలకు నిదర్శనమని ఆయన కొనియాడారు. యువతలో సాహస స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఇటువంటి యాత్రలు కీలక పాత్ర పోషిస్తాయని దత్తాత్రేయ పేర్కొన్నారు.
భాంధవి విజయానికి ఆమె తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, మద్దతు అభినందనీయమని, కుటుంబ సహకారమే యువత విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని చెప్పారు. లడాఖ్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలవాలని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్
పరస్పరం అవినీతి కప్పిపుచ్చుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్
కో లివింగ్ హాస్టల్స్‌లో అసలు ఏం జరుగుతుందో పరిశీలించాలి