అరుణాచలంతో సహా ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర

అరుణాచలంతో సహా ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర

రామేశ్వరం సహా దక్షిణ భారత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలని భావిస్తున్న వారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం ప్యాకేజీ ప్రకటించింది.  ఈ ప్యాకేజీలో భాగంగా రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, తంజావూరు వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.

ఐఆర్‌సీటీసీ ప్రకటించిన ఈ టూర్ జూలై 20వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.  ఈ యాత్రలో 702 మంది ప్రయాణికులకు అనుమతి ఉండగా, అందులో 160 స్లీపర్ క్లాస్, 490 థర్డ్ ఏసీ, 52 సెకండ్ ఏసీ సీట్లు ఉన్నాయి. ఈ స్పెషల్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.   అయితే ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్లలో కూడా ఎక్కే, దిగే అవకాశం కల్పించారు. 

ఈ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, తిరుచ్చిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలోని అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్ తదితర ప్రదేశాలను సందర్శించనున్నారు.

ప్రయాణికుల చార్జీల విషయానికి వస్తే స్లీపర్ క్లాస్‌లో ఒక్కో వ్యక్తికి రూ.15,600 వసూలు చేయనున్నారు. థర్డ్ ఏసీ క్లాస్‌కు రూ.23,100, సెకండ్ ఏసీ క్లాస్‌కు రూ.29,500 చార్జీ చేస్తున్నారు. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులకు స్లీపర్ క్లాస్‌లో రూ.14,600, థర్డ్ ఏసీలో రూ.21,900, సెకండ్ ఏసీలో రూ.28,100గా ధరలు నిర్ణయించారు.

ఈ ప్యాకేజీలో భాగంగా యాత్ర మొత్తం రోజుల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తారు. అదనంగా ప్రతి ప్రయాణికుడి ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. టూర్ ఎస్కార్ట్స్ కూడా అందిస్తారు. దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాలను తక్కువ ఖర్చుతో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ ప్యాకేజీ మంచి అవకాశంగా నిలవనుంది. ఆసక్తి గల వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.