కరీంనగర్ లో బిజెపి మహా పాదయాత్రకు ప్రజాదరణ అపూర్వం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్‌లో నిర్వహించిన మహా పాదయాత్రకు ఉమ్మడి జిల్లా ప్రజలు, వేలాది మంది కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్. రాంచందర్ రావు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంతో పాటు, అనంతరం నిర్మల్ జిల్లాలో జరిగిన బీజేపీ పాదయాత్రలోనూ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాలను అఖండ విజయవంతం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 
 
కరీంనగర్ గడ్డపై నుంచి బిజెపి అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని స్పష్టమైన సందేశం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. బిజెపి కార్యక్రమాలకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ నాయకుల్లో అసహనం పెరిగిందని రాంచందర్ రావు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారని, కానీ వాస్తవానికి 90 సీట్లలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతవుతాయనే భయం వారిని వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. 
 
గతంలో ‘మోసగాడు’ సినిమా లాగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలిస్తే, నేడు ‘మోసగాళ్లకు మోసగాడు’ లాగా కాంగ్రెస్ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడానికి అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ (‘కొడంగల్ టిల్లు’, ‘ట్విట్టర్ టిల్లు’) రెండూ ఒక్కటవుతున్నాయని ఆయన ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వస్తే తమ అవినీతి సాగదన్న భయమే ఆ రెండు పార్టీలను కలుపుతోందని పేర్కొంటూ తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని, అవినీతి రహిత, సుపరిపాలన అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చిందంటూ గతంలో తప్పుడు ప్రచారం చేసిన కేసీఆర్, ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే తరహాలో కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, భవిష్యత్తులో అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు సుమారు రూ. 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని గణాంకాలతో సహా వివరించారు. 

 
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర నిధులు కోరే ముందు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో డీపీఆర్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వివరాలను స్పష్టంగా సమర్పించాలని రాంచందర్ రావు సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు సక్రమంగా పంపకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడం సరికాదని హితవు చెప్పారు. 

About The Author