గృహిణులు దేశ నిర్మాతలు.. వారికి నెలకు రూ.30,000 పరిహారం 

గృహిణులు దేశ నిర్మాతలు.. వారికి నెలకు రూ.30,000 పరిహారం 
గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణించినా, వైకల్యం సంభవించినా నెలకు కనీస పరిహారం కింద ఈ మొత్తం చెల్లించాలని సూచించింది.    రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా మరణించినా లేదా వైకల్యం సంభవించినా బాధితుల ఆదాయం వంటి వివరాల ఆధారంగా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం అందిస్తాయి. 

ఈ సందర్భంగా గృహిణి చేసే కృషి కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా, దేశ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. గృహిణులు ఇంటి పని చేస్తూ, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ.. వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. అంతిమంగా వారు దేశాభివృద్ధికి కృషి చేస్తారు అని కోర్టు అభిప్రాయపడింది.

వేతనం లేని గృహిణులు చేసే పనిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ దృష్ట్యా రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణిస్తే.. నెలకు రూ.30,000 చొప్పున ప్రత్యేక పరిహారాన్ని మంజూరు చేయాలని మోటారు ప్రమాదాల పరిహార ట్రిబ్యునల్ (ఎంఎసిటిని)ను సుప్రీం ఆదేశించింది. గృహిణి చేసే పనికి వెల కట్టలేమని, ఆమె చేసే పనికి ఈ మొత్తాన్ని కనీస విలువగా పరిగణించడం జరిగిందని, అలాగే ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇది 10 శాతం పెరుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ఒకవేళ ఆ గృహిణికి ఉద్యోగం ఉంటే, ఆమె సంపాదనకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లంచాలని సుప్రీం ఆదేశించింది. ఈ సందర్భంగా గృహిణుల పనిపై 2019లో నిర్వహించిన ‘టైమ్ యూజ్ సర్వే’ను కూడా కోర్టు ఉటంకించింది. 15 – 59 వయసు మహిళలు వేతనం లేని గృహ, సరక్షణ పనుల కోసం రోజూ 7 గంటలకు పైగా సమయం గడుపుతున్నారని, పురుషులు మూడు గంటల కంటే తక్కువ సమయమే గడుపుతున్నారని ఈ సర్వే తెలిపింది. 

అలాగే మహిళలు ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ, సగటున 2.6 రెట్లు ఎక్కువ వేతనం లేని సంరక్షణ/గృహ పనులను చేస్తున్నారుని ఈ సర్వే తెలిపింది. సాధారణంగా గృహిణులు చేసే పనులకు పరిహారం తక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే ఈ పనిని ఇటు కూలీ పనిలాగా కాకుండా, అటు స్కిల్డ్, నాన్ స్కిల్డ్ పనిలాగా కాకుండా చూస్తారు. 

అందుకే పరిహారం విషయంలో గృహిణులకు తగిన న్యాయం జరగడం లేదు.  2001లో పంజాబ్‌లో ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె తరఫున పరిహారం కోరుతూ భర్త, ముగ్గురు పిల్లలు మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అనంతరం ఈ అంశం వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతూ చివరికి సుప్రీంకోర్టు వరకు చేరింది. తాజాగా కోర్టు వారికి అనుకూలంగా, పరిహారం చెల్లించాలని ఆదేశించింది.