2024 ప్రారంభం కల్లా భారత్‌లో స్వదేశీ 6జీ వ్యవస్థ

త్వరలోనే భారత్‌లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6జీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని   కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఒక వెబినార్‌లో ఆయన పేర్కొన్నారు. 

“6జి సాంకేతికతను అభివృద్ధి చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అది 2024 లేదా 2023-చివరి కాలంలో ఎక్కడో కనిపిస్తుంది. ఆ దిశగానే మనం వెళ్తున్నాం. నెట్‌వర్క్‌లను అమలు చేయడానికి మనం భారతదేశంలోనే టెలికాం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాము.  అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో తయారు చేసిన టెలికాం పరికరాలు, భారతదేశం టెలికాం నెట్‌వర్క్‌లలో సేవలందించవచ్చు. ఇక్కడి నుండి అవి ప్రపంచంపై కూడా అందుబాటులోకి వస్తాయి” అని కేంద్ర మంత్రి వివరించారు.

‘న్యూ టెక్నాలజీ అండ్ ది గ్రీన్ ఎకానమీ: టూ ట్రెండ్స్ షేపింగ్ ఎ న్యూ ఇండియా?’ అనే అంశంపై ఫైనాన్షియల్ టైమ్స్ . ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఆన్‌లైన్, ఎజెండా-సెట్టింగ్ వెబ్‌నార్  సిరీస్‌లో నాల్గవ కార్యక్రమంలో పాల్గొంటూ అవసరమైన అనుమతులు ఇప్పటికే ఇచ్చిన్నట్లు చెప్పారు. 

అలాగే వచ్చే ఏడాదిలోనే 5జీని లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.  వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో అంటే మార్చి తర్వాత 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ ఈ విషయంలో ఇప్పటికే ట్రాయ్‌ (టీఆర్‌ఏఐ) పలు కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించిందని, ఈ చర్చలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ముగుస్తాయని వెల్లడించారు.

అలాగే 2022 రెండో త్రైమాసికంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో టెలికం రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, టెలికాం కంపెనీల స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తొమ్మిది నిర్మాణాత్మక, విధానపరమైన సంస్కరణలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఈ సంస్కరణల్లో భాగంగా, ప్రభుత్వం వాయిదా వేసిన స్పెక్ట్రమ్,  సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం కోసం టెల్కోలకు ఒక అవకాశం  ఇచ్చింది. మూడు టెల్కోలలో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నాలుగేళ్ల మారటోరియంను ఎంచుకున్నాయి. 

”సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆమోదించిన సంస్కరణలకు మంచి స్పందన లభించింది. పరిశ్రమ ఇప్పుడు ఆ సంస్కరణలకు సర్దుబాటు చేస్తోంది. ఆ సంస్కరణల వల్ల పరిశ్రమలో ఉన్న చాలా ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోయింది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. మనం  ఇప్పటికే మరో 3-4 నెలల్లో వచ్చే సంస్కరణల సెట్‌పై పని చేస్తున్నాము, ”అని వైష్ణవ్ తెలిపారు. 

సెప్టెంబర్‌లో ప్రకటించిన సంస్కరణల్లో భాగంగా, 4 సంవత్సరాల మారటోరియం కాకుండా, వేలం క్యాలెండర్‌ను క్రమబద్ధీకరించడం,  వేలం నుండి స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను తొలగించడం వంటి మార్పులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ టెల్కోలు చేస్తున్న డిమాండ్. పైగా, 
టెలికాం రంగం కూడా ఆటోమేటిక్ మార్గం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుండి 100 శాతంకు పెంచారు.