ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్‌తో శనివారం నిర్వహించిన ప్రతినిధి స్థాయి చర్చల్లో రెండు దేశాలు తమ బంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఆవిష్కరణలు, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధి, రక్షణ, సెమీకండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించాయి.
భారత్‌కు నెదర్లాండ్స్ అత్యంత ముఖ్యమైన భాగస్వామ్య దేశాల్లో ఒకటని మోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, బాధ్యతాయుత ప్రవర్తన రెండు దేశాల ఉమ్మడి దృక్పథమని తెలిపారు. ఇదే విజన్‌తో భారత్- నెదర్లాండ్స్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
దాదాపు పదేళ్ల తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. గత దశాబ్దంలో ద్వైపాక్షిక సంబంధాలు విశేషంగా పురోగతి సాధించాయని చెప్పారు. చర్చల అనంతరం ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం కీలకంగా మారింది.
గుజరాత్‌లోని ధోలేరా సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రాజెక్టుకు ఇది తోడ్పడనుంది. భారత్‌తో ఏఎస్ఎంఎల్ కుదుర్చుకున్న తొలి భాగస్వామ్యం ఇదేనని విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జోర్జ్ తెలిపారు. ఈ ఒప్పందం భారత సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి పెద్ద ఊతమిస్తుందని పేర్కొన్నారు.

More Stories
హైకోర్టు తీర్పుతో భోజ్‌శాల సముదాయంలో విశేషంగా పూజలు!
భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్
సింధూ జలాలపై ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెల్లదన్న భారత్