భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ప్రశ్నలు అడగడం అవసరం

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ప్రశ్నలు అడగడం అవసరం
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం, ప్రశ్నలు అడగడం అవసరమని చెబుతూ వాటిని దృఢంగా చేయాలని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు.  నాగ్‌పూర్‌లోని  ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో   80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 
 
ప్రజాస్వామ్యంలో భిన్నమైన ఆలోచనలు, దృక్పథాలు ఉండటం సహజమని చెబుతూ ప్రజలు తమ వాదనలను వినిపించవచ్చని, ఇతరుల వాదనలకు స్పందించవచ్చని డాక్టర్ భగవత్ ఈ సందర్భంగా తెలిపారు.  ప్రజాస్వామ్యంలో చర్చలు, సంభాషణలు, భిన్నాభిప్రాయాలు, నిరసనలు సహజమని, అయితే ప్రజలు తమ బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు.
 
కస్తూర్చంద్ పార్క్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “భిన్నమైన ఆలోచనలు, వాటిని వ్యక్తీకరించే భిన్నమైన మార్గాలు ఉంటాయి. ఇదే ప్రజాస్వామ్యం. అందుకే ఇక్కడ సంభాషణలు, చర్చలు, వాదనలను వినిపించడం, ఇతరుల వాదనలకు స్పందించడం వంటి ప్రక్రియలు ఉంటాయి” అని చెప్పారు. 
 
“పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు సహజంగానే తలెత్తుతాయి. కొన్నిసార్లు వ్యతిరేకత కూడా అవసరమే. మనం వాటికి అండగా నిలవాలి” అని సూచించారు. రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ, ఈ అంశాలపై ఆయన చూపిన మార్గాన్ని దేశం అనుసరించవచ్చని భగవత్ చెప్పారు.
 
 “నిరసనలు, ఉద్యమాలు ఉండవచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ అలా చేసేటప్పుడు మనం ఎల్లప్పుడూ మన బాధ్యతలను గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు దేశానికి రాజ్యాంగాన్ని సమర్పిస్తున్న సమయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన రెండు ప్రసంగాలలో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించారు. మనం ఆ మార్గాన్ని అనుసరించవచ్చు” అని ఆయన తెలిపారు.
 
భారతదేశ యువత దేశానికి “జనాభా పరమైన వరం” అని, వారిని సరైన రీతిలో తీర్చిదిద్దితే వారు దేశానికి గొప్ప ఆస్తిగా మారగలరని పేర్కొంటూ, యువతను సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారిని సరైన మార్గంలో నడిపించ, వారిని భాగస్వాములను చేయడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. యువతను సరిగ్గా తీర్చిదిద్దితే, వారు దేశానికి గొప్ప ఆస్తిగా మారుతారని ఆయన పేర్కొన్నారు. 
 
నేటి యువత సుమారు 30 ఏళ్ల తర్వాత వృద్ధాప్య దశకు చేరుకుంటారని, అప్పుడు తమ తర్వాతి తరం పట్ల బాధ్యతతోనూ, సానుభూతితోనూ వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.” డాక్టర్ భగవత్ ఇలా తెలిపారు: “ఒక దేశం కఠోర శ్రమతో స్వాతంత్ర్యాన్ని పొంది, ఆ తర్వాత సుసంపన్నంగా, సురక్షితంగా ఎలా మారుతుందో, అలాగే ఈ ‘కేసరి ,రంగు’ (కాషాయ రంగు) మనకు త్యాగ భావన ఆవశ్యకతను గుర్తుచేస్తుంది.” 
 
ఆయన ఇంకా ఇలా చెప్పారు: “త్యాగపూరితమైన, కర్తవ్యపరాయణమైన జీవితాన్ని గడపడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుంది. మనస్సు నిర్మలమవుతుంది. ఇదే పవిత్రతకు చిహ్నమైన తెలుపు రంగు.” త్రివర్ణ పతాకంలోని ఆకుపచ్చ రంగు గురించి ప్రస్తావిస్తూ భగవత్ ఇలా పేర్కొన్నారు: “దీని ద్వారా మనకు సమృద్ధి లేదా సంపద అనే మూడవ రంగు లభిస్తుంది.” 
 
జాతీయ పతాకం పౌరులకు “త్యాగం, కర్తవ్య దీక్ష, జ్ఞానం” వంటి విలువలను గుర్తుచేస్తుందని తేలిపారు.  “ఇది మనందరికీ గర్వకారణం,  ఉత్సాహభరితమైన సందర్భం. 1857 నుండి చూస్తే, దాదాపు 90 ఏళ్లపాటు మనం వివిధ మార్గాల్లో త్యాగాలు చేశాము. మన పూర్వీకులు మనకు ఆ స్వేచ్ఛను అందించారు. ఆ త్యాగాల పట్ల గర్వభావం మన హృదయాల్లో ఉంది” అని ఆయన పేర్కొన్నారు. 
ఐక్యత ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: “వ్యక్తులుగా మనం భిన్నంగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. అదంతా సహజమే. కానీ ఇదంతా ఐక్యతకు నిదర్శనం. ఇది ఐక్యత వ్యక్తీకరణ.”