ఐపీఎల్‌లో కంటెంట్ కల్చర్ శ్రుతి మించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానం వరకు తాను ఎవరితో మాట్లాడినా వార్త అవుతుందని విచారం వ్యక్తం చేశారు. తమ చుట్టూ నిరంతరం కెమెరాల నిఘా ఉండటంతో స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ అతి కల్చర్ ఆటగాళ్లకు అసౌకర్యంగా మారిందని చెప్పారు.
తాజాగా మయాంతి లాంగర్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘ఆర్‌సిబి పాడ్‌కాస్ట్’లో కంటెంట్ క్రియేషన్ కోసం ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్ చేస్తున్న పనులను కోహ్లీ తప్పుబట్టారు. వారి అతి కారణంగా తన ఫ్రెండ్ కేన్ విలియమ్సన్‌తో మనసు విప్పి మాట్లాడలేకపోయానని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ దిక్కుమాలిన కల్చర్‌పై నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. `డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానం వరకు నేను ఎవరితో మాట్లాడినా అది వార్త అయిపోతుంది. ఇది నాకు అసౌకర్యంగా, అతిగా అనిపిస్తుంది.’అని తెలిపారు.
“నాకు ఆటలో ఉండే ఒత్తిడి అంటే ఇష్టం. నిజాయితీగా చెప్పాలంటే దీన్ని తప్ప మరే ఒత్తిడిని నేను ఇష్టపడను. ఏ జట్టుకైనా కమర్షియల్ ప్రమోషన్స్, అభిమానులను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా మంచి వేదిక. ఇది అర్థం చేసుకోదగిన విషయమే. కానీ ఈ కంటెంట్ క్రియేషన్‌పై కాస్త నియంత్రణ ఉండాలి” అని సూచించారు. జట్ల అధికారిక ఫ్యాన్ క్లబ్స్, అధికారిక ఫ్యాన్ పేజీలు ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఊపందుకున్నాయి తప్ప అంత ముందుకు లేవనే విషయం గ్రహించాలని హితవు చెప్పారు.
ఆధునిక బ్రాడ్‌కాస్టింగ్ విధానం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు నిరంతరం కంటెంట్ అందించడంపైనే ఎక్కువగా ఆధారపడుతోందని పేర్కొంటూ ఆటగాళ్ల నుంచి నింతరం ఫుటేజ్ కోసం డిమాండ్ చేయడం వల్ల సహజమైన వాతావరణం దెబ్బతింటుందని కోహ్లీ హెచ్చరించారు.
“ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం బయటికి రాగానే చుట్టూ కెమెరాలు వెంబడిస్తున్నాయి. ఇది ఆటగాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. ఓ ఆటగాడికి ప్రశాంతమైన వాతావరణంలో తన ఆటను మెరుగుపర్చుకునే అవకాశం, స్వేచ్ఛ ఉండాలి. కానీ అలా కాకుండా ఆటగాడు చేసే ప్రతీ పనిని రికార్డ్ చేస్తూ, విశ్లేషిస్తూ ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది” అని తెలిపారు.
“అలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకంటే దాన్ని కూడా ఎవరైనా రికార్డ్ చేస్తే.. వాటిపై కూడా చర్చలు చేస్తారనే భయం వారిలో ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల ఆటను బట్టి అంచనా వేయాలి. కానీ మ్యాచ్‌కు ముందు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు? నెట్స్‌లో ఎలాంటి షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనే విషయాలను చర్చిస్తూ విమర్శించడం సరికాదు” అని కోహ్లీ తేల్చి చెప్పారు.

More Stories
బెంగాల్లో వేగంగా అడుగులు వేస్తున్న సువెందు ప్రభుత్వం
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్
ఐదేళ్లలో తైవాన్ పై చైనా దాడి .. అమెరికా భయం!