ఒకే నాణానికి రెండు ముఖాలు డీఎంకే, అవినీతి 

తమిళనాడులో అధికార డీఎంకేపై విరుచుకుపడుతూ డీఎంకే, అవినీతి ఒకే నాణానికి రెండు ముఖాలన్ని   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు.  ‘వారసత్వ రాజకీయాలకు’ ఆ పార్టీ ప్రతీతి అని విమర్శించారు. 

కేంద్రంలోని నరేంద్ర మోదీ  నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వమును, తమిళనాడులోని ప్రభుత్వంతో పోల్చిన నడ్డా, రాష్ట్రంలోని పాలక ప్రభుత్వం “అవినీతి, దుష్పరిపాలన, బంధుప్రీతి,  పక్షపాతంలతో  ఉద్దేశ్యంతో అవినీతితో నిండిపోయింది” అని ఆరోపించారు. 

జనధన్ యోజన, గ్రామీణ గృహనిర్మాణం, స్వచ్ఛ్ భారత్ మిషన్, వివిధ రహదారుల ప్రాజెక్టులు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు సహాయం వంటి వివిధ పథకాల ద్వారా పేదలకు, మహిళలకు సేవ చేయాలనే ఆసక్తి ప్రధాన మంత్రితో కనిపిస్తోందని ఆయన గుర్తు చేశారు. 

తమిళనాడులో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ డీఎంకేలో కుటుంబం కాకుండా మరెవరైనా వచ్చి నాయకత్వం వహిస్తారని ఎవరైనా ఊహించగలరా? అని నడ్డా ప్రశ్నించారు. నడ్డా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నాలుగు బిజెపి కార్యాలయాలను తిరుప్పార్  నుండి ప్రారంభించిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 

బిజెపికి పొన్ రాధాకృష్ణన్, ఎల్ మురుగన్, నైనార్ నాగేంద్రన్,  ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వంటి “చాలా నిరాడంబరమైన నేపథ్యం” నుండి నాయకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు  ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య విలువలకు సవాల్ అని ఆయన హెచ్చరించారు. 

తమిళనాడు కోసం మోదీ చేసిన వివిధ ప్రయత్నాలను గుర్తు చేస్తూ, మదురైలో ఒక ఎయిమ్స్‌ను, రాష్ట్రానికి 11 మెడికల్ కాలేజీలను ప్రధాని మంజూరు చేశారని నడ్డా చెప్పారు. ఇతర పార్టీల కార్యాలయాలు నాయకులు, కుటుంబసభ్యుల ఇళ్ల నుండి పని చేస్తున్నాయని దుయ్యబట్టారు.

‘‘ఒకసారి నాయకుడు వెళ్తే, పార్టీ పోతుంది, ఒకసారి కుటుంబం వెళ్తే, పార్టీ పోతుంది’’ అని ఆయన  ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ప్రజల గొంతుకగా నిలిచేందుకు రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.