
ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉత్తర భారత దేశానికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వ్యూహాత్మకంగా కీలకంగా మారనున్నట్లు ఆయన తెలిపారు. ఇత్తర భారత దేశంపై లాజిస్టిక్స్ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీ-ఎన్సీఆర్, వెస్ట్ యూపీ ప్రజలకు ఈ ప్రాజెక్టుతో లబ్ధి చేకూరనున్నట్లు ఆయన తెలిపారు.
గత ప్రభుత్వాలు యూపీని విస్మరించాయని ప్రధాని విమర్శించారు. బహుళజాతి కంపెనీలు ఇప్పుడు తమ పెట్టుబడులకు యూపీనీ కేంద్రంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు యూపీని చీకట్లోకి నెట్టేశాయని, ఇప్పుడు యూపీకి అంతర్జాతీయ గుర్తింపు వస్తోందని తెలిపారు.
ఏడు దశాబ్ధాల తర్వాత ఈ రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని ప్రధాని చెప్పారు. నోయిడ్ విమానాశ్రయం వేలాది మంది పశ్చిమ యూపీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని తెలిపారు. 20 ఏళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్ కు ప్లాన్ చేయగా కేంద్రం-యూపీ ప్రభుత్వాల మధ్య పోరుతో ఆగిపోయిందని ఆయన గుర్తు చేశారు.
‘ఉత్తరప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో నవంబర్ 25వ తేదీ ప్రముఖ దినంగా ఉండిపోతుంది. మద్యాహ్నం ఒంటిగంటకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన జరిగింది. నిర్ణయించుకున్న సమయంలోనే ఇది పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టుతో వ్యాపార, పర్యాటక రంగాలకు కొత్త ఊపు అందుకుంటుంది. అలాగే అనేక రంగాలకు మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఇక్కడే 40 ఎకరాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్, ఓవరాల్, మెయింటేనెన్స్ కోసం నిర్మాణాలు జరగబోతున్నాయి. ఇక్కడి వందలాది మంది యువతకు దీంతో ఉపాధి లభిస్తుంది. రాజకీయాలు కాదు, మౌలికాభివృద్ధి అవసరం’’ అని ప్రధాని వివరించారు.
నోయిడాకు దగ్గర్లోని జేవార్ లో 1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయానికి మొదటి దశలో రూ 10, 500 కోట్లు ఖర్చు చేయనున్నారు. నోయిడా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
2024 నాటికి ఈ ప్రాజెక్టునుపూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు.. భవిష్యత్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు విస్తరించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి.
యూపీలో జిన్నా అనుచరుల విధ్వంసం
దేశ విభజనకు కారణమైన మహ్మద్ అలీ జిన్నా అనుచరులు పశ్చిమ యూపీలో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోపించారు. ఇక్కడి రైతులు గతంలో చెరకును పండించి తీపిని పంచేవారని, కానీ కొందరు ఈ తీపిని హరించేలా ఘర్షణలు ప్రేరేపించారని ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడి చెరుకు తీపిని ఎల్లెడలా వ్యాప్తి చేసే పాలకులు కావాలో, జిన్నా అనుచరుల ఉన్మాదం కావాలో నిర్ణయించుకోవాలని యోగి పిలుపు ఇచ్చారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!