భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రకటించారు. జూన్, జులై నెలల్లో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటలన కోసం శనివారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అలాగే దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీని తొలిసారి జాతీయ జట్టులోకి సెలక్టర్లు తీసున్నారు.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అయితే కెప్టెన్సీ కోల్పోయి సూర్యకుమార్ ఏ సిరీస్‌లోనూ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా ఇండియా రెండు టీ20లు ఆడనున్నది. జూన్ 26, 28వ తేదీల్లో ఆ మ్యాచ్‌లు డబ్లిన్‌లో జరగనున్నాయి. ఇక జూలై ఒకటో తేదీ నుంచి 11 తేదీ వరకు ఇంగ్లండ్‌తో అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌తో పాటు 2028లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను ప్రకటించారు. టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో సీనియర్ జట్టుకు ఎంపికైన యువ బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. టోర్నీలో అత్యధికంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్‌లు కూడా భారత బృందంలో ఉన్నారు.
ఇక సీనియర్ ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షదీప్ సింగ్ కూడా భారత బృందంలో ఉన్నారు. యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత మూడు ఐపీఎల్ సీజన్లలో నాయకుడిగానే కాకుండా బ్యాటర్‌గానూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2024లో తన జట్టును (కోల్‌కతా) ఛాంపియన్‌గా నిలిపిన అతడు, 2025లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించి రన్నరప్‌గా నిలిపాడు. తాజా సీజన్లోనూ బ్యాటర్‌గా రాణించాడు. 498 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది.
టీ20లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌లో గేమ్ ప్లాన్‌తో దుమ్మురేపిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్‌ను కూడా సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది. ఇక స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లకు బుమ్రాను ఎంపిక చేయలేదు. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్ కోసం అతన్ని ఎంపిక చేసింది. ఇక గాయపడ్డ కోహ్లీ స్థానంలో వన్డేల కోసం జైస్వాల్‌ను తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో జైస్వాల్ ఆడనున్నాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్ వరకు కోహ్లీ కోలుకునే అవకాశాలు ఉన్నట్లు అగార్కర్ చెప్పారు.
భారత జట్టు ఇదే
శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ(వీసీ), నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ

More Stories
ఇస్లాంలోకి మారమని బాస్ వత్తిడితో విప్రో ఉద్యోగిని రాజీనామా!
తీవ్రతరం దాలుస్తున్న రైతులు, జంతువుల ఘర్షణలు!
భారత్- చైనా సరిహద్దు వివాదంలో రష్యా జోక్యం చేసుకోదు