‘వికసిత్ భారత్’ దిశగా దేశ ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో భారత యువత (జెన్ జెడ్) జీవితాలు, వారి ఎంపికలు, నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. అలాగే, వేగంగా మారుతున్న ప్రపంచంలో నిరంతరం నేర్చుకునేవారే విజయం సాధిస్తారని ఆయన నొక్కి చెప్పారు.
ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, వేగవంతమైన సాంకేతిక పురోగతి, ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితులలో వస్తున్న మార్పులు యువతకు సవాళ్లతో పాటు కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్‌డీ పరిశోధకులతో సహా మొత్తం 3,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
“ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచ అధికార సమతుల్యత క్షణక్షణం మారుతోంది. ఈ పరిణామానికి ప్రధాన కారణం సాంకేతికతలో వస్తున్న వేగవంతమైన పురోగతి. రాబోయే 20–30 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు,” అని ప్రధాని మోదీ పెక్రోన్నారు. “అయితే, మార్పు సంభవించినప్పుడల్లా అది సవాళ్లతో పాటు కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తుంది. ప్రపంచం మారుతుంది, సాంకేతికత పురోగమిస్తుంది. పరిశ్రమలు విస్తరిస్తాయి. వృత్తులు పరిణామం చెందుతాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి: నిరంతరం నేర్చుకునేవారే విజయం సాధిస్తారు,” అని ఆయన తెలిపారు.
విద్యార్థులు తమ జిజ్ఞాసను, నేర్చుకోవాలనే తపనను సజీవంగా ఉంచుకోవాలని ప్రధాని కోరారు. నిరంతరం కొత్త జ్ఞానాన్ని సంపాదించేవారే వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించడానికి ఉత్తమ స్థితిలో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కొత్త పరిష్కారాలను కనుగొనే ధైర్యం ఉన్నవారికి సవాళ్లు అవకాశాలుగా మారగలవని ఆయన చెప్పారు.
ప్రతి తరం దాని స్వంత సవాళ్లను ఎదుర్కొంటుందని, దేశం పట్ల ఒక ప్రత్యేక బాధ్యతను కలిగి ఉంటుందని ప్రధాన మంత్రి తెలిపారు. రాబోయే మూడు, నాలుగు దశాబ్దాలలో వారి నిర్ణయాలు , సహకారాలు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పట్టభద్రులతో ప్రధాని పేర్కొన్నారు.
తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని, దేశ అవసరాలను తీర్చడంలో తమ పని ఎలా దోహదపడుతుందో ప్రశ్నించుకోవాలని ఆయన వారిని కోరారు.
ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే పట్టభద్రులు సాంకేతికత, పరిశ్రమలు, వృత్తి మార్గాలలో ప్రధాన పరివర్తనలకు సాక్ష్యమిస్తారని ఆయన తెలిపారు. పని స్వభావం గణనీయంగా మారినప్పటికీ, భవిష్యత్తులో సంబంధితంగా ఉండటానికి, విజయం సాధించడానికి నిరంతర అభ్యాసం చాలా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణలు భారతదేశ యువ ప్రతిభకు ఒక ప్రధాన అవకాశమని మోదీ హైలైట్ చేస్తూ, దేశ శాస్త్రీయ, సాంకేతిక పురోగతికి పట్టభద్రులు దోహదపడాలని కోరారు. “మీ అందరి ముందు మరో గొప్ప అవకాశం ఉంది, ఆ కొత్త అవకాశం పరిశోధన రంగంలో ఉంది…” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత స్థాయి పరిశోధనలు చేసేందుకు అవకాశాలు కల్పించే ప్రధానమంత్రి పరిశోధన ఫెలోషిప్‌తో సహా, యువ పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకం, జాతీయ పరిశోధనా ఫౌండేషన్ ఏర్పాటును కూడా మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమాలు భారతదేశ పరిశోధనా వ్యవస్థను బలోపేతం చేయడానికి, నూతన ఆలోచనలు, సాంకేతికతల అభివృద్ధిని ప్రోత్సహించడానికి రూపొందించామని తెలిపారు.
శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత మద్దతు అందించే లక్ష్యంతో, పరిశోధనా రంగానికి ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల వరకు నిధులను కూడా సమకూరుస్తోందని ఆయన చెప్పారు. ‘ఒకే దేశం ఒకే చందా’ (వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్) కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా, చిన్న పట్టణాల్లోని సంస్థలతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ అందుబాటును విస్తరించామని మోదీ తెలిపారు.
ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, పరిశోధన, ఆవిష్కరణలు, వర్ధమాన సాంకేతికతలలో భారతదేశ సామర్థ్యాలను పెంపొందించడానికి దోహదపడాలని ఆయన పట్టభద్రులను ప్రోత్సహించారు.

More Stories
మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వండి.. రాహుల్ కు కిరణ్ రిజిజు సవాల్
సుప్రీంకోర్టులో ఎంపీ మహువా మొయిత్రాకు చుక్కెదురు
అరుణాచల్‌లోని 27 ప్రదేశాలను చైనా పేర్లను తిప్పికొట్టిన భారత్