భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్

భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్
దేశంలో తొలిసారి భారీ ఎత్తున జీహాదీ డ్రగ్ పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా వివాదాస్పద సింథటిక్ డ్రగ్ ‘ క్యాప్టగన్ ‌’ను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’లో భాగంగా నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.182 కోట్ల విలువైన ‘క్యాప్టగన్‌’ ట్యాబ్లెట్లను గుర్తించినట్టు తెలిపారు. ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఎన్సీబీ మే 11న ఈ ఆపరేషన్ నిర్వహించింది.
ఢిల్లీలో 31.5 కిలోల క్యాప్టగన్ టాబ్లెట్లు దొరికాయని, వీటిని చపాతీ కటింగ్ మెషీన్‌లో రహస్యంగా దాచిపెట్టారని తెలిపారు. జెడ్డా, సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలకు ఈ డ్రగ్స్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అమిత్ షా తెలిపారు. “‘మత్తుపదార్థ రహిత భారతదేశం’ కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘ఆపరేషన్  రేజ్‌పిల్’ ద్వారా, మా ఏజెన్సీలు రూ. 182 కోట్ల విలువైన, ‘జిహాదీ డ్రగ్’గా పిలువబడే ‘క్యాప్టగన్‌’ను మొట్టమొదటిసారిగా స్వాధీనం చేసుకున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను,” అని షా తెలిపారు. 
అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియా పౌరుడ్ని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. టూరిస్ట్ వీసాపై 2024 నవంబరు 11న భారత్‌కు వచ్చాడని, జనవరి 1, 2025తో గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉన్నట్టు గుర్తించారు. అతడి ఇచ్చిన సమాచారం ఆధారంగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో మే 14 సోదాలు నిర్వహించి, మూడు బ్యాగుల్లో దాచిన 196.2 కిలోల టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. 
 
అత్యంత చౌక ధరకు లభించే ‘క్యాప్టగన్‌’ను ‘జిహాదీ డ్రగ్’, ‘పేదవాడి కొకైన్‌’గా పిలుస్తారు. పశ్చిమాసియా దేశాలు, యుద్ద ప్రాంతాల్లో ఈ డ్రగ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. సిరియా అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దీనిని ఉపయోగించారు. ఈ డ్రగ్‌ను తీసుకుంటే ఎక్కువ గంటలు నిద్ర లేకుండా ఉండటం, అలసట, భయం లేకపోవడం వంటి ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే దీనిని ‘జిహాదీ డ్రగ్’ అని అంటారు. 1960 దశకంలో దృష్టిలోపం, నార్కోలెప్సీ ఉన్న రోగులకు చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగించేవారు. 
 
అయితే, దీనిని ఉపయోగిస్తే ఆ మత్తు అలవాటుగా మారుతుందని చాలా దేశాలు నిషేధించాయి. కానీ ఇది అసలైంది కాదు. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ డ్రగ్‌లో రహస్యంగా యాంఫెటమైన్, మెతాంఫెటమైన్ వంటి హానికారక రసాయనాలను కలుపుతున్నారు.  ఈ డ్రగ్‌ తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఉత్సాహంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా తీవ్ర మానసిక సమస్యలు, హింసాత్మక ప్రవర్తన వంటి దుష్పరిణామాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈక్వెడార్ నుంచి వచ్చిన ఒక కంటైనర్‌లో దాచి ఉంచిన 349 కిలోగ్రాముల కొకైన్‌ను ముంబయిలో ఇటీవల పట్టుబడిన నేపథ్యంలో తాజా ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం అంతర్జాతీయ సిండికేట్లు వాణిజ్య సరుకులను, కంటైనర్ల ద్వారా జరిగే వ్యాపార మార్గాలను వినియోగించుకుంటున్నారనడానికి ఇదో ఉదాహరణ. 
 
ఈ సిండికేట్‌కు సంబంధించిన సేకరణ మూలాలు, ఆర్థిక మరియు హవాలా సంబంధాలు, లాజిస్టిక్స్ మధ్యవర్తులు, అంతర్జాతీయ స్వీకర్తలు, విస్తృత అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను గుర్తించడానికి ఎన్‌సిబి ఒక సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే ప్రపంచ సమస్యకు సామూహిక ప్రతిస్పందనను నిర్ధారించడానికి, నిఘా సమాచార మార్పిడి, మాదకద్రవ్యాల కింగ్‌పిన్‌ల అప్పగింత, మాదకద్రవ్య ఉగ్రవాదం, డ్రగ్ కార్టెల్స్‌పై సమన్వయ చర్యల ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది.