కుటుంభం సభ్యులను కించపరచడం తగదు 

కుటుంబ సభ్యులను కించపరచటం తగదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయని తెలిపారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఉన్నారని పవన్ విమర్శించారు. 

పైగా ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్ చెప్పారు. 

ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందని పవన్ మండిపడ్డారు. 

ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబసభ్యులను తక్కువచేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలోతాను ఖ్యానించిన్నట్లు ఆయన గుర్తు చేశారు.

ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుందని పవన్ హితవు చెప్పారు. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయవద్దని ఈ సందర్భంగా కోరుతున్నానని పవన్ కల్యాణ్ అభ్యర్ధించారు.