అసెంబ్లీలో అసభ్య పదజాలంతో విమర్శలు తగవు 

ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, రాష్ట్ర శాసనసభలో అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమే అవుతుందని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ వై సుజనాచౌదరి విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో కొందరు సభ్యులు విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదని ఆయన స్పష్టం చేశారు.  సభా నాయకుడిగా వున్న ముఖ్యమంత్రి ఇలాంటివారిని ప్రోత్సహించడం తగదని హితవు చెప్పారు.

రాజకీయాల్లో విమర్శలు విధానాలపై వుండాలని, కానీ ప్రస్తుతం వ్యక్తులను దాటి, కుటుంబం వరకు వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఉన్నత విలువలతో, సంస్కారవంతమైన భాషతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివేచన కలిగినవారంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని ఆయన సూచించారు. వ్యక్తిత్వం లేని నేలబారు నేతలను చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయని ధ్వజమెత్తారు.

మన పిల్లల కోసం మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే దిగజారుడు నేతలను దూరం పెట్టాలని స్పష్టం చేశారు. లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయనాయకులన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకునే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు. కాబట్టి పార్టీలకు  అతీతంగా నేతలంతా రాజకీయాల్లో విలువలను కాపాడేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు.

ఇలా ఉండగా, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వాఖ్యాలను ఆమె సోదరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. భువనేశ్వరి వ్యక్తిత్వంను కించపరిచే విధంగా వ్యవహరించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “నేను, మా సోదరి విలువలతో పెరిగాం. విలువల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు” అని ఆమె స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌ గురించి దేశమంతా సిగ్గుగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ సభ్యత, సంస్కారాన్ని మంటగలిపారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం దురదృష్టకరమని… మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు.

కాగా, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అ‘భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడం బాధ కలిగించింది. క్యారెక్టర్‌ అసాసినేషన్‌ సహేతుకం కాదు. నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం. విలువల్లో రాజీపడే ప్రసక్తి లేదు’ అని పురంధేశ్వరి ట్వీట్‌ చేశారు.

సెంబ్లీ పరువు తీస్తున్నారని, సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.  చంద్రబాబు కుటుంబం గురించి కొందరు వైసీసీ నేతలు అసభ్యకరంగా మాట్లాడి సభామర్యాదను మంటగలిపారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.