విశాఖ ఉక్కు ప్రమాదంపై నివేదిక కోరిన ఎన్ హెచ్ ఆర్ సి

విశాఖ ఉక్కు ప్రమాదంపై నివేదిక కోరిన ఎన్ హెచ్ ఆర్ సి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి, 9 మంది మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి,  విచారణకు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.    విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్ట్ షాప్-1లో జరిగిన లాడిల్ పేలుడుకు నాసిరకం ఫెర్రోఅలాయ్‌లే కారణమని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు.
కొంతకాలంగా కార్మికులు ఫెర్రోఅలాయ్‌ల నాణ్యత తక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. బుధవారం, ఎస్ఎంఎస్-2 విభాగంలో ల్యాడిల్ నుండి ఉక్కు ద్రవం కిందపడి నేలపాలైన ఘటన జరగ్గా,  గురువారం ఉదయం ‘ఎ’ షిఫ్ట్ ప్రారంభమైన కొద్దిసేపటికే, సుమారు 6:30 గంటల ప్రాంతంలో ల్యాడిల్‌కు రంధ్రం పడటంతో వేడి స్టీల్ మెటల్ ద్రవం భారీగా నేలపాలైంది. 
 
ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ ప్రస్తుతం విచారణ జరుపుతుండగానే, మళ్లీ ఇలా వరుసగా రెండు రోజులు ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా,  ఉక్కు ఉత్పత్తిలో నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కరిగిన ఇనుము నుంచి వాయువులను తొలగించడానికి (డీగ్యాసింగ్) అల్యూమినియం, అధిక నాణ్యత గల ఫెర్రోఅలాయ్‌లను కలుపుతారు. 
 
ఆ తర్వాత కరిగిన లోహాన్ని ఒక లాడిల్‌లో ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్‌కు తరలిస్తారు, అక్కడ దానిని నైట్రోజన్, ఆర్గాన్‌తో శుద్ధి చేస్తారు. నాసిరకం ముడి పదార్థాలలో ఉండే స్లాగ్  ఉక్కు లోపల వ్యర్థ వాయువులను ఉత్పత్తి చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ వాయువులు ఒత్తిడికి గురై అకస్మాత్తుగా బయటకు వెలువడటంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.