ప్రముఖ రంగస్థల కళాకారుడు, రచయిత, దర్శకుడు ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు (71) మంగళవారం తెల్లవారుజామున గుంటూరులో కన్నుమూశారు. నటుడు, నాటక రచయిత, దర్శకుడు, శిక్షకుడిగా తెలుగు రంగస్థలానికి కృష్ణేశ్వరరావు విశేష సేవలందించారు. పలువురు కళాకారులకు శిక్షణ ఇచ్చి, తాను రచించి, దర్శకత్వం వహించిన అనేక నాటకాలను వివిధ పరిషత్తులు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శించారు.
ఆయన రచించిన ప్రముఖ నాటకాలలో ‘సంపద’, ‘కాళ్లు కడిగిన చేతులు’, ‘రోజు చస్తున్న మనిషి’, ‘గుర్తు తెలియని శవం’, ‘పక్కింట్లో పుట్టండి’ తదితరాలు ఉన్నాయి. సమాజాన్ని నిశితంగా పరిశీలించే దృష్టి, సామాజిక సమస్యలపై స్పందన, అర్థవంతమైన రంగస్థలాన్ని అందించాలనే తపన ఆయన రచనల్లో స్పష్టంగా కనిపించేవి.
తెలుగు చలనచిత్ర రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. స్క్రిప్ట్ రచయితగా ‘ప్రచండ భారతం’, ‘పరశురామ్’, ‘జయం మనదేరా’ తదితర చిత్రాలకు పనిచేశారు.
నటుడిగా ‘భద్రాచలం’, ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపికా గోదావరి’, ‘నాంది’, ‘విరూపాక్ష’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’, ‘ఏజెంట్ అత్రేయ’ తదితర చిత్రాల్లో నటించారు. రంగస్థల కళాభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమైనది. రసజ్హురి, పొన్నూరు కళాపరిషత్ ను స్థాపించి నాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పలువురు కళాకారులను ప్రోత్సహించారు.
దృశ్య వేదిక, అప్పాజోస్యుల ఫౌండేషన్లతోనూ ఆయనకు సన్నిహిత అనుబంధం ఉంది. ఆయా సంస్థల సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తన వంతు సహకారం అందించారు. కృష్ణేశ్వరరావు మృతికి పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారిలో దృశ్య వేదిక అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ, సుమధుర కళా నికేతన్ ప్రధాన కార్యదర్శి పి. విజయ భాస్కర శర్మ, దొంతాల ప్రకాశ్, బి. ఆంజనేయ రాజు, ఈ. భగీరాజ్, డి.ఏ. శర్మ, బేటా రామసూర్య ప్రకాశ్, ఏ. భాస్కర చంద్ర, తమ్మిన మధుకుమార్, సిల్వెస్టర్, నరేన్ బొర్రా, వెనిగళ్ల భాస్కర్, డి.వి. చంద్రశేఖర్, వి.వి.ఎస్. ప్రకాశ్, సూర్యదేవర జగన్నాథరావు, వేదాంతం వెంకట చలపతి, జి. శైలశ్రీ, కె. సురేష్‌బాబు, జి.వి. రంగారెడ్డి, ఉమామహేశ్వర పత్రుడు తదితరులు ఉన్నారు.
దృశ్య వేదిక వ్యవస్థాపకుడు హేమాద్రి ప్రసాద్ మాట్లాడుతూ, ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావుకు దృశ్య వేదికతో ఉన్న అనుబంధం, సాంస్కృతిక రంగానికి ఆయన అందించిన సేవలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో, గౌరవంతో స్మరించబడతాయని తెలిపారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన చేసిన కృషి తెలుగు రంగస్థల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఆయన మృతి తెలుగు నాటక రంగానికి తీరని లోటు అని చెబుతూ యువ కళాకారులను తీర్చిదిద్దడంలో ఆయన చూపిన అంకితభావం, రంగస్థలంపై ఆయనకు ఉన్న ప్రేమ ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

More Stories
విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్
వైఎస్ వివేకానందరెడ్డి అసలు హంతకులను గుర్తించాలి
విలువల పరిరక్షణకు మహాయజ్ఞం `శ్రీవాణి’ పత్రిక