రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ సమావేశాలు విశాఖపట్నంలో ఈ నెల 19 నుంచి 21 వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరుగుతాయి. గత యేడాది ఈ సమన్వయ్ బైఠక్ జోధ్ పూర్ వేదికగా జరిగింది. సెప్టెంబర్ 5,6,7 తేదీలలో జరిగింది. ఈ బైఠక్ లో సంఘ్ స్ఫూర్తితో పనిచేస్తున్న మొత్తం 32 సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయని సంఘ్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
ఈ సంస్థలకు చెందిన అఖిల భారత స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు, ఎంపిక చేసిన ఇతర ముఖ్య బాధ్యులు ఈ బైఠక్ కి హాజరవుతారు. ఈ సంస్థలన్నీ గత అనేక సంవత్సరాలుగా సామాజిక రంగంలో నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ప్రజా జీవితంలోని వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు, మార్పులను తీసుకురావడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో ఈ సంస్థలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయి.
మరో వైపు ఈ సమన్వయ్ బైఠక్ లో ఆయా సంస్థలు తమ కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. అలాగే వివిధ అంశాలపై తమ పరిశీలనలు, సూచనలను కూడా తెలియజేస్తాయి. అన్ని సంస్థల మధ్య పరస్పర సమన్వయం, సహకారాన్ని మరింత పెంపొందించడంపై అలాగే ప్రజా సంక్షేమం, విధానపరమైన అంశాలపై చర్చలు జరుగుతాయి. జనాభా అసమతౌల్యత, యువతలో వున్న వ్యసనాలపై విముక్తి, పంచ పరివర్తన అమలు వంటి అంశాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చించనున్నారు.
సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలు, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షం,యు రాష్ట్ర సేవికా సమితిలతోసహా 32 సంస్థల ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

More Stories
విజయవాడలో ఆకట్టుకున్న ‘భువన విజయము’ సాహిత్య రూపకం
వైసీపీలో నంబర్ 1గా సజ్జల, నంబర్ 2గా జగన్!
విశాఖ ఏపీటిడబ్ల్యుఆర్ పాఠశాలపై బాలల కమిషన్ జోక్యం చేసుకోవాలి