ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం 

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని జనజీవన అస్తవ్యస్థం అయింది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా పంటలకు భారీగా నష్టం సంభవించింది. 
భారీ వర్షాలు, వరదల్లో గల్లంతై.. లేదా ఇళ్లు కూలి ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని, మొత్తం 17 మంది గల్లంతైనట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రకటించింది. 

నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో మొత్తం 24 మరణాలు సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
రాష్ట్రంలోని 172 మండలాల పరిధిలో మొత్తం 1316 గ్రామాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా అపార నష్టం ఏర్పడినట్లు సమాచారం అందిందని, 23,345 హెక్టార్లల్లో పంట వర్షాలకు కొట్టుకుపోయిందని తెలిపింది. 

ముఖ్యంగా  19,645 హెక్టార్లల్లో ఉద్యానవన తోటలు, పండ్లు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లగా, ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది. అలాగే కోళ్ల పరిశ్రమకు కూడా 2403 జీవాలు మృతి చెందడం వల్ల రూ 2.31 కోట్ల నష్టం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా రాష్ట్ర  ప్రభుత్వం రూ. 7 కోట్లను విడుదల చేసింది.

వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు గురైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో శనివారం ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల సాయం ప్రకటించారు. 

ఊహించని వరదలతో పంటలు, పంట పొలాలు, ఇళ్లు నష్టపోయిన వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. చెయ్యేరు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని, పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే కాకుండా ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలు తగ్గుముఖం పట్టగా.. వరద బీభత్సం నుంచి మాత్రం ఇంకా ఉపశమనం లభించలేదు. కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కడప–తిరుపతి, కడప–అనంతపురం, కడప–నెల్లూరు, రాయచోటి–వేంపల్లెతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.