స్వచ్ఛనగరంగా ఇదో సారి ఇండోర్

దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నిలిచింది. ఇలా ఇండోర్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది అయిదో సారి కావడం విశేషం. రెండో స్థానంలో సూరత్ (గుజరాత్), మూడో స్థానంలో విజయవాడ (విజయవాడ)  నిలిచాయి. దేశంలో పరిశుభ్రమైన రాష్ట్రంగా చత్తీస్‌గఢ్ మొదటి స్థానంలో నిలిచింది. 

కాగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ  లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అత్యంత స్వచ్ఛమైన గంగా టౌన్‌గా నిలవగా, బీహార్‌లోని ముంగేర్, పాట్నాలు ఈ కేటగిరీలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డులను ప్రకటించింది. విజేతలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సర్వేలో మహారాష్ట్ర అత్యధికంగా 92 అవార్డులను దక్కించుకోగా, చత్తీస్‌గఢ్ 67 అవార్డులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సర్వే కింద గార్బేజ్ ఫ్రీ సిటీల కేటగిరీలో మొత్తం 9 నగరాలు ఇండోర్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, నవీ ముంబయి. అంబికాపూర్, మైసూరు, నోయిడా, విజయవాడ, పటాన్‌లకు 5 స్టార్ సిటీ ర్యాంకింగ్‌లు పొందగా, 143 నగరాలు, 3 స్టార్ సిటీలుగా గుర్తింపు పొందాయి. 

కాగా సఫాయి మిత్ర సురక్ష కింద 3 లక్షల లోపు జనాభా కేటగిరీలో కరీంనగర్ కార్పొరేషన్ దేశంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుని రూ.4 కోట్ల పారితోషికాన్ని అందుకుంది. తాజాగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 28 రోజుల్లో మొత్తం 4,320 నగరాల్లో సర్వే నిర్వహించామని, 4.2 కోట్ల మంది తమ అభిప్రాయాలను తెలియజేశారని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పురి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఇండోర్ సాధించిన విజయానికి నగర ప్రజలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ‘ఇండోర్ నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరసగా అయిదో సారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు. పౌరులకు పరిశుభ్రతపట్ల అవగాహన కలించడం వల్లనే ఇది సాధ్యమైంది’ అని కలెక్టర్ మనీశ్ సింగ్ ట్వీట్ చేశారు.