ఎయిర్‌బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కో పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశించింది. వైమానిక దళ అధికారుల సమాచారం ప్రకారం, జోర్హాట్‌లోని రౌరియా ప్రాంతంలో ఉన్న ఎయిర్‌బేస్‌లో విమానం దిగుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పూర్తి స్థాయి రక్షణ చర్యలు, దర్యాప్తు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన తొలి దృశ్యాల్లో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు కనిపించింది. విమానం ముందు భాగం నుంచి ఇంకా పొగలు వెలువడుతున్నట్లు వీడియోలు, చిత్రాల్లో స్పష్టమైంది.
ప్రమాదం అనంతరం మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనాస్థలంలో భారత వైమానిక దళ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక సమాచారం ఇంకా వెలువడలేదు. జోర్హాట్ ప్రాంతంలో శనివారం ఉదయం వాతావరణం మేఘావృతంగా ఉండటంతో వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదానికి కారణమయ్యాయా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఏఎన్-32 అనేది సోవియట్ యూనియన్ కాలంలో అభివృద్ధి చేసిన ద్వి-ఇంజిన్ సైనిక రవాణా విమానం. ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో దీన్ని రూపొందించింది. భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ విమానం, ఎన్-26 మోడల్ ఆధారంగా రూపొందించారు. విమాన రెక్కలపై అమర్చిన శక్తివంతమైన ఇంజిన్లు దీని ప్రత్యేకత.
అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, లద్ధాఖ్ వంటి క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో సైనిక సామగ్రి, సిబ్బంది రవాణాకు ఈ విమానాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇటీవలే భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం అస్సాంలోని కర్బీ అంగ్‌లాంగ్ జిల్లాలో కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతిచెందారు.

More Stories
ఢిల్లీలో పాక్ ఉగ్ర ముఠా కుట్ర భగ్నం
`ఆధార్’ గుర్తింపు కార్డు మాత్రమే… కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
ఐఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతమార్పిడి