నీట్ లీకేజీ ఆందోళనకారులపై చర్యలు వద్దని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం

నీట్ లీకేజీ ఆందోళనకారులపై చర్యలు వద్దని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం

నీట్ పేపర్ లీకేజీపై చేపట్టిన ఆందోళన సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదని తెలిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటిస్తామని స్పష్టం చేసింది.  ఆందోళనకు పాల్పడిన వారిపై ఢిల్లీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆందోళనకు పాల్పడిన వారిలో పలువురిని గుర్తించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోగా, ఇంకొందరిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు. అనేకమందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 

అయితే, ఈ దాడులకు పాల్పడిన మైనర్లపై, గతంలో క్రిమినల్ కేసులు లేనివారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బిహార్, అసోం వంటి అనేక రాష్ట్రాలు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ హోం మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఎలాంటి క్రిమినల్, నేర చరిత్ర లేని ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించింది. అలాగే, అదుపులోకి తీసుకున్న లేదా అరెస్టు చేసిన నిందితుల్ని వదిలేస్తామని కూడా ప్రకటించింది.  అయితే, ముందుగా నిందితుల వివరాలు, నేర చరిత్రను సమీక్షించిన తర్వాతనే కేసులు ఎత్తివేస్తామని, వారిని విడుదల చేస్తామని చెప్పింది. 

ఒకవేళ గతంలో క్రిమినల్ కేసులుంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తమ నిర్ణయానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది.  ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ సమాచారం ప్రకారం, జూలై 29 సాయంత్రం 6 గంటల వరకు నీట్ (యుజి) పరీక్షలో జరిగినట్లు ఆరోపించిన అక్రమాలపై జరిగిన నిరసనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 13 కేసులను నమోదు చేశారు. “తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి శాంతియుత నిరసనలలో పాల్గొన్న విద్యార్థులపై ఎటువంటి చర్యలూ తీసుకోబడవు” అని హోం మంత్రి ఆశిష్ సూద్ పేర్కొన్నారు. 

“శాంతియుత పద్ధతిలో తమ భావాలను వ్యక్తం చేసే ప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుంది. కానీ శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల మాత్రం ఎటువంటి ఉదారత చూపబడదు” అని సూద్ స్పష్టం చేశారు. “ఈ నిరసనలలో పాల్గొన్న వ్యక్తులపై ఢిల్లీ  పరిధిలోని ఏ పోలీసు విభాగం కూడా ఎటువంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు తీసుకోదు” అని హోం శాఖ తెలిపింది.