సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. ఓం బిర్లా ఆశాభావం

ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అన్ని అంశాలపైనా, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో చేసిన మంచి పనులపైనా చర్చ జరుగుతుందని పేర్కొ న్నారు.  ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరిగే అవకాశం ఉంది. 

ఓం బిర్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ రానున్న శీతాకాలం సమావేశాల్లో అన్ని సమస్యలపైనా చర్చ జరుగుతుందని చెప్పారు.  ఇటీవల ఓం బిర్లా ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో మాట్లాడుతూ, సభ్యులు స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించేవిధంగా అన్ని రాజకీయ పార్టీలతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. 

క్రమశిక్షణా రాహిత్య ధోరణి పెరగడాన్ని ఆపాలని కోరుతూ చట్ట సభల్లో అంతరాయాలు కలిగించడం, గందరగోళం సృష్టించడం వంటివాటిని నిలువరించాలని చెప్పారు. సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్ తదితర అంశాలపై సభ్యుల నిరసనల మధ్య వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

వర్షాకాల సమావేశాలకు కేటాయించిన సమయంలో 22 శాతం సమయంలో లోక్‌సభ కార్యకలాపాలు, 28 శాతం సమయంలో రాజ్యసభ కార్యకలాపాలు జరిగాయి. మిగిలిన సమయం వృథా అయింది.