ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై సిపిఎం, జేఎంఎం అసంతృప్తి

ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై సిపిఎం, జేఎంఎం అసంతృప్తి

* కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ ఘాటైన లేఖ!

జూన్ 8న కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సమావేశానికి హాజరుకాబోమని డీఎంకే ప్రకటించిన కొద్ది రోజులకే, ప్రతిపక్ష కూటమిలో కొత్త విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సీపీఎం,  జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీలు కాంగ్రెస్ నాయకత్వానికి తమ అసంతృప్తిని తెలియజేశాయి. జార్ఖండ్ నుండి జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి, ఒక అభ్యర్థి పేరును కాంగ్రెస్ “ఏకపక్షంగా” ప్రకటించడంపై జేఎంఎం అసహనంతో ఉంది. 

మరోవైపు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన విమర్శలు/దాడుల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ  సీపీఎం  ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఘాటైన లేఖ రాశారు.

అంతేకాకుండా, ఒక అసాధారణ చర్యగా,  సీపీఎం ఆ లేఖను కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలకు కూడా పంపింది. “మేము ఆ లేఖను చూశాము. ఇది కాంగ్రెస్,  సీపీఎం మధ్య ఉన్న విషయం అయినప్పటికీ, ‘ఇండియా’ కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా, అందరినీ కలుపుకుపోతూ ఐక్యతను కాపాడాలని మేము కాంగ్రెస్‌ను కోరగలము,” అని ఒక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించారు.

ఖర్గేకు రాసిన లేఖలో బేబీ ఇలా పేర్కొన్నారు: “కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో,  సీపీఎం,  బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకత్వం పద్ధతి ప్రకారం సాగించింది. అంతేకాకుండా,  సీపీఎం సీనియర్ నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు, అప్పటి ముఖ్యమంత్రి అయిన కామ్రేడ్ పినరయి విజయన్ కూడా మోదీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ‘లేకపోతే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ని ఎందుకు విచారించలేదు లేదా అరెస్టు చేయలేదు?’ అనే ప్రశ్నను వారు లేవనెత్తారు.”

 “ఇవి ఎన్నికల ప్రచార వేడిలో అడపాదడపా చేసిన వ్యాఖ్యలు కావు. మీ రాజకీయ ప్రచారంలోనే ప్రధానాంశంగా నిలిచాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, స్వయంగా మీరు… ఇలా ప్రతి జాతీయ నాయకుడు పదేపదే అటువంటి ఆరోపణలు చేశారు,” అని  సీపీఎం నేత లేఖలో రాశారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు 2023 జూన్‌లో విస్తృత వేదికగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి విజయానికి  సీపీఎం  చిత్తశుద్ధితో కృషి చేసిందని పేర్కొంటూ బేబీ ఇలా అన్నారు: “విచిత్రమేమిటంటే, ఇప్పుడు  సీపీఎంకు బీజేపీతో ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు. ఇది మేము తేలికగా తీసుకోలేని ఒక అవాస్తవ ప్రచారం. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఐక్యత మూలాలనే దెబ్బతీస్తుంది.” 

“కేరళలో ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మా వందలాది మంది కార్యకర్తలు అమరులయ్యారన్న విషయం మీకు తెలిసి ఉండాలి. అలాగే, కేరళలో గత పదేళ్ల ఎల్‌డిఎఫ్ పాలనలో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎటువంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, ఇది లౌకికవాదం, మత సామరస్యాన్ని కాపాడటంలో మాకున్న నిబద్ధతకు నిదర్శనమని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము,” అని ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడితో పేర్కొన్నారు. 

విజయనన్‌పై ఈడీ చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ పదేపదే కోరారని కూడా బేబీ పేర్కొన్నారు. “దీనిని బీజేపీ వ్యతిరేక వైఖరి అని అనవచ్చా లేక తోటి ప్రతిపక్ష నాయకుడిపై చట్టవిరుద్ధమైన శిక్షాత్మక చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వాన్ని ఆహ్వానించడమా? ఈ విషయాలపై స్పష్టత రాకపోతే, ‘ఇండియా’ కూటమి ఉద్దేశ్యమే ప్రశ్నార్థకం అవుతుంది” అని సిపిఎం స్పష్టం చేసింది. 

“భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇటువంటి విచ్ఛిన్నకర చర్యల విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీపైనా, కాంగ్రెస్ నాయకత్వంపైనా ఉంది,” అని బేబీ ఖర్గేను నిలదీసేరు. జూన్ 8న జరగనున్న సమావేశం నేపథ్యంలో ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉందని  సీపీఎం  భావించిందని బేబీ చెప్పారు.

“అయితే, మోదీ ప్రభుత్వ నియంతృత్వ, మతతత్వ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయడానికి పార్లమెంటులో ‘ఇండియా’ కూటమికి, ఇతర ప్రతిపక్ష పార్టీలకు  సీపీఎం  పూర్తి సహకారం అందిస్తుంది. ఎన్ని దాడులు, అవాస్తవ ప్రచారాలు జరిగినప్పటికీ ఈ విషయంలో  సీపీఎం వెనకడుగు వేయదు,” అని ఆయన స్పష్టం చేశారు. 

మరోవంక, జార్ఖండ్ నుండి జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో రెండు స్థానాలకు గాను ఒక స్థానానికి తమ అభ్యర్థిగా ఏఐసీసీలో ఖర్గే కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ప్రణవ్ ఝాను కాంగ్రెస్ ప్రకటించడం పట్ల జేఎంఎం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార జేఎంఎం, ఆ రాష్ట్రం నుండి రెండు స్థానాలకు తమ అభ్యర్థులనే పోటీలో నిలపాలని కోరుకుంది.

రెండు స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఉంది. శుక్రవారం జరిగిన జేఎంఎం నాయకత్వ సమావేశం తర్వాత, ఆ పార్టీ నాయకులు తాము రెండు స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించవచ్చని పేర్కొన్నారు. శనివారం నాడు, జేఎంఎం ఒక స్థానానికి మాజీ మంత్రి బైద్యనాథ్ రామ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక రెండో స్థానం విషయానికి వస్తే, కాంగ్రెస్‌తో చర్చల అనంతరం పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని జేఎంఎం ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య వెల్లడించినట్లు సమాచారం. 

జార్ఖండ్‌లో ఎగువ సభ (రాజ్యసభ) ఎన్నికల్లో విజయం సాధించడానికి, ఒక అభ్యర్థికి కనీసం 28 ‘మొదటి ప్రాధాన్యత’ ఓట్లు అవసరం. ఒక స్థానాన్ని గెలుచుకోవడానికి అవసరమైన సంఖ్య కంటే 4 ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ, బీజేపీ కూడా ఒక అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 24 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.