నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిపిజే) వ్యవస్థాపకుడు, అమెరికా నుంచి తిరిగి వచ్చిన అభిజీత్ దిప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టిన కొద్ది సేపటికే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శనివారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో కూర్చున్న వారి చేతుల్లో దేశ యువత “కీలుబొమ్మల”లా (పావుల్లా) కదలరని ఆయన స్పష్టం చేశారు.
రాంచీలో జరిగిన ‘మేధావుల సమావేశం’లో బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ, “విదేశాల్లో కూర్చున్న కొందరు వ్యక్తులు భారత యువతకు తామే దిశానిర్దేశం చేయగలమని భావిస్తున్నారు. కానీ భారత యువత కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోని పావులుగా వ్యవహరించరు,” అని తెలిపారు. దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి తమ పార్టీ అనుమతించదని ఆయన మరింత స్పష్టంగా చెప్పారు.
“ఈ దేశ యువతను ప్రతికూల రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్న వారికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. భారత యువత సానుకూల రాజకీయాల వైపే సాగుతారు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యతిరేకిస్తాం, కానీ ప్రజాస్వామ్య విలువలు లేదా ప్రమాణాలు దెబ్బతినడానికి మాత్రం అంగీకరించం,” అని ఆయన తేల్చి చెప్పారు. యువత దేశ నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి ప్రధాన్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన నిరసనను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. యువత తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం. దేశాభివృద్ధికి తోడ్పడటంపై దృష్టి సారిస్తున్నారని చెబుతూ కొన్ని శక్తులు యువతను వ్యవస్థకు వ్యతిరేకమైన రాజకీయాల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అటువంటి ప్రయత్నాలు విజయవంతం కావని నబిన్ హెచ్చరించారు.
నిరసన తెలిపే హక్కును అంగీకరిస్తూనే, ప్రతిపక్షం ప్రజాస్వామ్య విలువల పరిధిలోనే ఉండాలని నబిన్ హితవు చెప్పారు. “ప్రజలకు వ్యతిరేకించే హక్కు ఉంది, కానీ అది ప్రజాస్వామ్య విలువల పరిధిలోనే ఉండాలి,” అని ఆయన సూచించారు. పొరుగు దేశాలలో కనిపించిన రాజకీయ ఉద్యమాలతో పోల్చి చూస్తూ, భారతీయ యువత ప్రజా జీవితంలో నిర్మాణాత్మకమైన, క్రమశిక్షణతో కూడిన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని నబిన్ తేల్చి చెప్పారు.
“మన పొరుగు దేశాలలో మనం చూసిన వ్యవస్థ-వ్యతిరేక ఉద్యమాలు దేశ యువతకు ఏమాత్రం సరిపోవు; ఎందుకంటే మన యువత దేశ నిర్మాణానికి క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో కృషి చేస్తారు,” అని ఆయన తెలిపారు.

More Stories
ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
భారత్ లో జపాన్ ప్రధాని మూడు రోజుల పర్యటన
వెనిజులాకు మానవతా సహాయంపై వేగంగా స్పందించిన భారత్