పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలకు స్పందించని ఎన్‌‌టిఎ, సిబిఎస్‌ఇ

పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలకు స్పందించని ఎన్‌‌టిఎ, సిబిఎస్‌ఇ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌,  సిబిఎస్‌ఇ  ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ సిస్టమ్‌ పరిణామాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. పేపర్‌ లీక్‌ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని  ఎన్‌‌టిఎను సూటిగా ప్రశ్నించింది.  ఎన్‌‌టిఎ  ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఎప్పుడైనా పేపర్ లీక్‌లు జరిగాయా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరింది.
 
పార్లమెంటరీ కమిటీ అడిగిన ప్రశ్నలకు సిబిఎస్‌ఇ జూన్ 8 లోగా, ఎన్‌టిఎ జూన్ 10 లోగా లిఖితపూర్వక సమాధానాలు సమర్పించాల్సి ఉన్నా, ఇప్పటివరకూ స్పందించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని ‘విద్య, మహిళలు, పిల్లలు, యువజన, క్రీడల వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ’ నీట్‌ పేపర్ లీక్, సిబిఎస్‌ఇ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఒఎస్‌ఎం) ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై విచారణ జరుపుతోంది. 
 
ఎన్‌‌టిఎ, సిబిఎస్‌ఇ ఉన్నతాధికారులను కమిటీ గత వారం పిలిపించి, పలు అంశాలపై వివరణ అడిగింది. నీట్‌ – ‌యుజి 2024లో అక్రమాలపై సిబిఐ విచారణతో సంబంధం లేకుండా ఎన్‌‌టిఎ విచారణ జరిపిందా? అని ప్రశ్నించింది.  గత మూడేళ్లుగా ఎన్‌టిఎ సిబ్బంది సంఖ్య, 2022 నుంచి జరిగిన కొత్త నియామకాల గురించి కూడా ప్రశ్నించింది. 
ఎన్‌టిఎ ద్వారా పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం, దాని నిర్మాణం, పనితీరు, పరీక్షల ప్రక్రియలో సంస్కరణలు, డేటా భద్రతా ప్రోటోకాల్‌లను మెరుగుపరచడం వంటి అంశాలపై సిఫార్సులు ఇవ్వడానికి, మాజీ ఇస్రో అధిపతి కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కేంద్రం 2024 జూన్‌లో ఏర్పాటు చేసింది. 
 
ఆ కమిటీ నివేదికలోని 101 సిఫార్సులలో ప్రతి దానిపై, ఎన్‌టిఎ తీసుకున్న చర్యలపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని పార్లమెంటరీ కమిటీ కోరింది. ఒఎస్‌ఎం కాంట్రాక్టుపై ఆర్‌ఎఫ్‌‌పి నిబంధనలు ఎందుకు బలహీనపరిచారు? ఒఎస్‌ఎం కాంట్రాక్టుకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌‌పి (అభ్యర్థన పత్రం) నిబంధనలను ఎందుకు సడలించారో లేదా బలహీనపరిచారో చెప్పాలని సిబిఎస్‌ఇని నిలదీసింది. 
 
ఒఎస్‌ఎం కాంట్రాక్ట్ కోసం జారీ చేసిన వివిధ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌‌పి)ల మధ్య వచ్చిన “మార్పుల” గురించి, అలాగే సిఒఇఎంపిటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు దానిపై ఏవైనా నేపథ్య తనిఖీలు నిర్వహించారా? అనే విషయంపై కూడా పార్లమెంటరీ కమిటీ సిబిఎస్‌ఇని ప్రశ్నించింది. 
 
2019 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విచారణలో తప్పుపట్టబడిన గ్లోబరేనా టెక్నాలజీస్ మూల్యాంకన సాఫ్ట్‌వేర్‌తో సిఒఇఎంపిటి ఎడ్యుటెక్ / లేదా దాని డైరెక్టర్లకు గతంలో సంబంధం ఉన్న విషయం తెలుసా? ఈ విషయాన్ని కాంట్రాక్ట్ కేటాయింపు నిర్ణయంలో ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? అనే విషయాలను కమిటీ సిబిఎస్‌ఇని ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
ఒఎస్‌ఎం కాంట్రాక్ట్ కోసం జారీ చేసిన మూడవ ఆర్‌ఎఫ్‌‌పిలో, గతంలో పేలవమైన పనితీరు కనబరిచిన బిడ్డర్లను అనర్హులుగా ప్రకటించే నిబంధనను ఎందుకు తొలగించారో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బిడ్డర్లను నిషేధించే నిబంధనను, మూడవ ఆర్‌ఎఫ్‌పిలో ప్రస్తుతం బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బిడ్డర్లను మాత్రమే మినహాయించేలా ఎందుకు సడలించారని, బిడ్డర్‌కు కనీస కంపెనీ టర్నోవర్‌ను ప్రత్యేకంగా రూ. 50 కోట్లుగా ఎందుకు నిర్ధారించారని కూడా ప్రశ్నించినట్లు వారు తెలిపారు.