పంజాబ్ లో బిజెపి, అమ‌రీంద‌ర్ పొత్తుకు సిద్ధం

వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ, మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పార్టీల మ‌ధ్య పొత్తు ఖరారుకు రంగం సిద్దమైనది. వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న చేసిన నేప‌ధ్యంలో కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ సింగ్‌తో బిజెపి దోస్తీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

సాగుచ‌ట్టాలు ర‌ద్దు చేస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధ‌మ‌ని కెప్టెన్ సింగ్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు సాగు చ‌ట్టాల ర‌ద్దును స్వాగ‌తిస్తూ కెప్టెన్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీతో ఆయ‌న క‌లిసి ప్ర‌యాణించ‌వ‌చ్చ‌నే దిశ‌గా సంకేతాలు పంపాయి.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దుపై తాను ఏడాదిపైగా కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాన‌ని, ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల‌తో అన్న‌దాత‌ల వాణిని వినిపించాన‌ని కెప్టెన్ సింగ్ పేర్కొన్నారు. 

రైతుల అభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని కూడా ఆయన స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీతో త‌మ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు కూట‌మి ఏర్పాటు చేస్తుంద‌ని అమ‌రీంద‌ర్ సింగ్ ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు.