పాకిస్థాన్ గడ్డపై వైమానిక దాడులకు వెనుకాడబొం 

పాకిస్థాన్ గడ్డపై నుంచి మన దేశానికి ముప్పు వస్తే, అక్కడికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు జరిపేందుకు వెనుకాడబోమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.  భార‌త్‌లో శాంతిని అస్థిరం చేసి అల‌జ‌డులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గ‌ట్టిగా జ‌వాబు ఇస్తూనే ఉన్నామ‌ని తెలిపారు. 

ఉతత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో శనివారం షహీద్ సమ్మాన్ యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించే శత్రు దేశాలకు ‘నవ భారత దేశం’ దీటుగా జవాబు చెప్తుందని స్పష్టం చేశారు. మన దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఆ ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామని ఆ దేశానికి స్పష్టమైన సందేశం పంపించినట్లు చెప్పారు. ‘‘ఇది నూతన, శక్తిమంతమైన భారత దేశం’’ అని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 

పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు. భారత్ ఎన్నడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగియుండటం భారత దేశ సంస్కృతి అని చెప్పారు. 

అయితే కొందరికి ఈ విషయాలు అర్థం కావని మండిపడ్డారు. మనకు మరో పొరుగు దేశం ఉందని, దానికి ఈ విషయాలేవీ అర్థం కావడం లేదని చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. భద్రతా దళాల కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు పెంచినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు.

 ఈ పరిహారం గతంలో రూ.2 లక్షలు ఉండేదని, దీనిని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.8 లక్షలకు పెంచిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో సైన్య ధామాన్ని నిర్మిస్తామని, దీని కోసం రాష్ట్రంలోని 1,734 మంది అమరుల కుటుంబాలు నివసిస్తున్న ఇళ్ల నుంచి మట్టిని సేకరిస్తామని చెప్పారు. 

న‌వంబ‌ర్ 18వ తేదీన రీజాంగ్ లాకు వెళ్లాన‌ని, కుమావ‌న్ బెటాలియ‌న్‌కు చెందిన 124 మంది జ‌వాన్లు అక్క‌డ అద్భుత‌మ చేశార‌ని, వాళ్లు చేసింది ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌న్నారు. అక్క‌డ జ‌రిగిన పోరులో 114 మంది జ‌వాన్లు అమ‌రుల‌య్యార‌ని, కానీ వాళ్లు సుమారు 1200 మంది చైనా సైనికుల్ని చంపేసిన‌ట్లు ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.