వరద సహాయంపై జగన్ కు ప్రధాని మోదీ భరోసా 

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 16మంది మృత్యువాత పడగా, మరో 70మంది గల్లంతయ్యారు. 

ఈ నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతు కాగా ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు. గుండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలు, నందలూరు ఆర్‌టిసి బస్సులో 3 మృతదేహాలు, రాజంపేటలోని మందపల్లి వద్ద 2 మృతదేహాలను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గల్లంతైన వారి కోసం స్థానిక పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్,ఎస్‌డిఎఫ్,అగ్నిమాపక శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ముఖ్యంగా రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి పెరగడంతో పాటు ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తడంతో జలాశయం ఎర్త్ బండ్ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేసి రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో పరిస్థితులను, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి నివేదించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. 

సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సీఎంకు భరోసా ఇచ్చారు. 

“రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారి తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ ప్రధాని తర్వాత ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలో ఇప్పటి వరకు 30 మంది వరకు గల్లంతయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపత్తూరులో వాగు మధ్యలో ఉన్న శివాలయానికి దర్శనానికి వెళ్లిన 11 మంది భక్తులు చనిపోయారు.  సిద్దవటం మండలం వెలుగుపల్లెల గ్రామంలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతయ్యారు.

చెయ్యేరు వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకోగా ఒక పల్లె వెలుగు బస్సు పూర్తిగా నీట మునిగింది. ఈ బస్సులో కండక్టర్‌ అహోబిలంతో సహా మరో నల్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో రెండు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. మరో ముగ్గురు ప్రయాణికులు చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. మరో ఆరుగురు ప్రయాణికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. కొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది. కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా  న‌దులు, వాగులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో వాహ‌నాలు, రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. నంద‌లూరు – రాజంపేట మ‌ధ్య ప‌ట్టాల‌పై నీటి ప్రవాహం ప్ర‌మాద‌క‌రంగా ఉంది.