విశాఖ స్టీల్‌ మూతపడే దుస్థితి శోచనీయం

గంగవరం పోర్టు కార్మికుల సమ్మె వల్ల బొగ్గు సరఫరా కొరత వచ్చి విశాఖ స్టీల్‌ కర్మాగారం మూతపడే దుస్థితి రావడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కూడా వ్యాఖ్యానించింది. తక్షణమే కార్మికుల సమ్మె పరిష్కారానికి సంబంధిత అధికారులు శ్రద్ధ తీసుకోవాలంది. 
 
గంగవరం పోర్టులోని బొగ్గు నిల్వల ఓడలను మళ్లించాలని విశాఖ పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశాఖ పోలీస్‌ కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారం కొనసాగిస్తామని ప్రకటించింది.
 
బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా చేసి విశాఖ స్టీల్స్‌ మూత పడకుండా చేయాలంటూ విశాఖ స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె వెంకట దుర్గాప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ నైనాల జయసూర్య గురువారం విచారణ జరిపారు. పోర్టులో కార్మికుల సమ్మె వల్ల విశాఖ ఉక్కులో బొగ్గు లేక స్టీల్‌ ప్లాంటులోని మూడు ఫర్నేజ్లలో ఒకటే పనిచేస్తోందని పిటిషనరు తరఫున న్యాయవాది అంబటి శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. 
 
రెండు ఫర్నేజ్లు దెబ్బతిన్నాయని, రిపేరు చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. బొగ్గు నిల్వలు లేకపోతే విశాఖ ఉక్కు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్టీల్‌ ప్లాంట్‌ సిఎమ్‌డి లేఖ రాశారని వివరించారు.  ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని, పోర్టు యాజమాన్యం, కార్మికులకు మధ్య గతంలోని ఒప్పందాన్ని పోర్టు మేనేజ్‌మెంటు అమలు చేయాల్సి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు పోర్టుకు చెప్పారని తెలిపారు.
 
పోర్టు తరఫున సీనియర్‌ న్యాయవాది వైవి రవిప్రసాద్‌ వాదిస్తూ, అమలు చేయలేని డిమాండ్లు పెడుతున్నారని, పోర్టు కోసం భూమి సేకరించిన ఫలితంగా నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కింద ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.