జీహెచ్ఎంసీకి ప్రభుత్వమే రూ. 678.64 కోట్ల ఆస్తిపన్ను బకాయి

గ్రేటర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ మహానగరంగా అభివృద్ధి చేస్తామని చెబుతూ వస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నగర పాలక సంస్థకు ఆర్ధికంగా దన్నుగా ఉండవలసింది పోయి, ప్రభుత్వం చెల్లించవలసిన పన్నులు కూడా చెల్లించకుండా దివాళా స్థితికి చేర్చుతున్నారు. 
జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. గత ఏడేండ్లుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.678.64 కోట్లు బకాయి పడింది. పన్నుల కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులను కూడా చెల్లించడం లేదు.
ఈ ఏడేండ్లలో కేవలం రూ.35 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ భవనాలు, ఇతర సంస్థలకు చెందిన భవనాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 2,500 వరకు ప్రభుత్వ ఆస్తులున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వాటి ద్వారా ప్రతి ఏటా రూ.102.54 కోట్ల పన్ను డిమాండ్ ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ సందర్భంలో ఆస్తుల వివరాలు పన్ను డిమాండ్తో కూడిన వివరాలను  బల్దియా ప్రభుత్వానికి అందిస్తుంది.
అంతేకాకుండా తమకు రాష్ట్ర ప్రభుత్వ భవనాలపై రూ.102 కోట్లు ఆస్తి పన్ను రూపంలో వస్తాయని జీహెచ్ఎంసీ బడ్జెట్లో సైతం పెట్టుకుంటుంది. ఇలా గడిచిన ఏడేండ్లుగా రాష్ట్ర  ప్రభుత్వం నుంచి రూ.714 కోట్ల వరకు ఆస్తి పన్ను రావాల్సి ఉంది.  రాష్ట్ర ప్రభుత్వం భవనాల్లో ఇటీవల కూల్చిన సచివాలయ భవనం, రాజ్ భవన్లోని నిర్మాణాలతోపాటు  సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్ కు కూడా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి.
ప్రగతి భవన్కు సంబంధించి ప్రతి ఏటా5.29 లక్షలు ఆస్తి పన్ను చెల్లించాలి.  2018–-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రగతి భవన్ది పెనాల్టీతో కలిపి రూ 25.50 లక్షలు జీహెచ్ఎంసీకి పన్ను బకాయి ఉంది. అంటే ప్రగతి భవన్  నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి అసలు ఆస్తి పన్ను చెల్లించనే లేదు.

ప్రతి ఏటా రూ.102 కోట్లు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉంది. అయినా సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. బడ్జెట్లో కేటాయించిన కొద్ది నిధులు కూడా ఇవ్వడం లేదు. మరోవైపు బల్దియా చేసిన అప్పుల మిత్తికే రోజుకు రూ.కోటి చెల్లిస్తోంది.