ఇప్పుడు వరంగల్ ప్రజలకు జంట నగరాల అనుభవం 

వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి జనం విలవిలలాడుతుంటారని పేర్కొంటూ ఇప్పుడు వరంగల్ ప్రజలకు ఇదే అనుభవాన్ని అధికార పార్టీ నేతలు అందిస్తున్నారని బిజెపి నేత విజయశాంతి ధ్వజమెత్తారు. 

తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసని ఆమె చెప్పారు. వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూస్తామంటూ గత ఏడేళ్ళ నుంచి పాలకులు చెబుతుండటం, జనం వింటుండటం జంటనగరాల ప్రజలకు మామూలైపోయిందని ఆమె తెలిపారు. 

గతేడాది వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ జలమయమై ఇంకా తేరుకోకముందే… గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలకు మళ్ళీ భీతిల్లిపోయే పరిస్థితి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

కిందటి సంవత్సరం ఆగస్టులో వానలు కురిసినప్పుడు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉరుకులు పరుగుల మీద సుడిగాలి పర్యటన చేసి వరంగల్ పరిసరాల్లో చోటు చేసికున్న వందలాది ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, వెంటనే చర్యలు తీసుకుని ముంపు ముప్పు తప్పిస్తామన్నారని విజయశాంతి గుర్తు చేశారు.

ఇదెంత నిజమో వరంగల్ వాసులకు ఇప్పుడు అర్థమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు. గత 2 రోజుల వానల్లో సుమారు 30 కాలనీలు నీట మునిగాయి. ఆక్రమణల కూల్చివేత పనులు అరకొరగా చేస్తున్నారు. కీలకమైన ప్రాంతాల్లో నాలాలపై ఆక్రమణల తొలగింపు, అడ్డుగోడల నిర్మాణం ఊసే లేదని ఆమె విమర్శించారు.

అవగాహన లేకుండా కాల్వలపై శ్లాబ్‌లు వేసి, రోడ్ల కంటే ఎత్తులో డ్రైనేజీలు కట్టే చారిత్రక వరంగల్ నగరాన్ని మరింత మురికి కూపం చేశారని ఆమె  మండిపడ్డారు. ఏ పని చేసినా జనాన్ని ముంచడమే తప్ప మంచి చెయ్యడం తెలియని ఈ సర్కారుకు ముంపు ముప్పు దగ్గరలోనే ఉందని విజయశాంతి హెచ్చరించారు.