40 శాతం మందికి కరోనా అనంతర సమస్యలు

కరోనా నుంచి కోలుకున్న తర్వాత 40 శాతం మందికి కరోనా అనంతర సమస్యలు వస్తున్నట్లు ఎఐజి హాస్పిటల్స్ అధ్యయనంలో తేలింది. దేశ వ్యాప్తంగా 3 కోట్ల కొవిడ్ రోగులపై పరిశోధనలు చేయగా సుమారు 40 శాతం మంది పోస్ట్ కొవిడ్‌తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు స్పష్టమైంది. 

వీరిలో ఎక్కువ శాతం మంది నీరసం, న్యూరో, కండరాల బలహీనత వంటి వాటితో బాధపడుతున్నట్లు ఏఐజి స్టడీలో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఆ ఆసుపత్రి చైర్మన్ డా నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రికి వచ్చే పోస్టు కొవిడ్ రోగులపై సర్వే నిర్వహించి, ఒక నివేదికను రూపొందించామని తెలిపారు. 

వీరిలో 74 శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది స్టెరాయిడ్స్ తీసుకోగా, 34 శాతం మంది ఆక్సిజన్‌పై కోలుకున్నట్లు వివరించారు. దీంతో మందుల వాడకంపై ఒక స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఈ సర్వే వలన ఏ రోగులకు ఎలాంటి మందులు వాడాలి? మైల్డ్, మోడరేట్, సివియర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ? మెడిసిన్‌లో మార్పులు ఏమిటీ? అనే అంశాలను పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకున్నామని చెప్పారు. 

కొంత మందిలో స్టెరాయిడ్స్ మోతాదు అధికంగా తీసుకోవడం వలనే నీరసం, ఒళ్లు నొప్పులు వంటివి కలుగుతున్నట్లు డా నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. స్టెరాయిడ్స్ వినియోగంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు రోజురోజుకి బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పోస్ట్ కొవిడ్ క్లినిక్‌ను కూడా ప్రారంభించామని తెలిపారు. 

ఈ క్లినిక్ ను సోమవారం ముఖ్యమంత్రి కార్యదర్శి నర్సింగ్‌రావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. దీని వలన రోగులకు కావాల్సిన చికిత్స సులభంగా అందుతుందని తెలిపారు. భారత్ లో  మొట్ట మొదటి పోస్ట్ కొవిడ్ క్లినిక్‌ను ప్రారంభించింది తామేనని డా.  నాగేశ్వరరెడ్డి చెప్పారు. 

ఈ క్లినిక్‌లో ఇంటర్నల్ మెడిసిన్, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ, సైక్రియాస్ట్రి, ఆర్ధోఫెడిక్, తదితర విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు.