నర్సుల తొలగింపును నిరసిస్తూ మహిళా మోర్చా ధర్నా

నర్సుల తొలగింపును నిరసిస్తూ కోఠి లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  కార్యాలయం వద్ద  బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి నేతృత్వంలో వందలాది మందితో ధర్నాకు తలపెట్టారు. పెద్ద సంఖ్యలో ధర్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మోర్చా నాయకురాలను పోలీసులు  అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.         

ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా చేయనున్న మహిళా మోర్చా కార్యకర్తల ధర్నాను పోలీసులు   అడ్డుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం. హక్కులను కాలరాయడమేఅని గీతా మూర్తి విమర్శించారు. పోలీసుల, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి మహిళా మోర్చా  కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా గీతా మూర్తి మాట్లాడుతూ  పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తమపట్ల అమర్యాదగా ప్రవర్తించడం ప్రభుత్వ నిర్దేశాలు తోనే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. నిరసన తెలియజేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్నదని నిరసన ప్రదర్శనలు ఆపేయాలని అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. 

 
నిరసన కార్యక్రమాలను పోలీసుల బలప్రయోగంతో టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.  కరోనా రాష్ట్రంలో విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ప్రభుత్వ వైద్యశాలలో  నర్సులను తీసుకోవడం జరిగిందని ఆమె విమర్శించారు. 
 
ప్రాణాలను సైతం పణంగా పెట్టిన నర్సులు బతికుంటే జీవనాన్ని కొనసాగించవచ్చని, తమ కుటుంబాన్ని ఆదుకోవచ్చని భావించి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆలోచనతో నర్స్ వృత్తిలోకి అనేకమంది మహిళలు చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు. వారిని నిర్దాక్షిణ్యంగా అర్ధాంతరంగా తొలగించడం ముఖ్యమంత్రి కేసీఆర్  నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందని దుయ్యబట్టారు.

ఇప్పటికీ వైద్యశాలలో నర్సుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో ఇప్పటికే ఉన్న నర్సులపైనా పని భారం చాలా ఉంది. వైద్య విధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు అనడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కు కనికరం లేదనడానికి ఈ నర్సుల తొలగింపు ఒక నిదర్శనం అని ఆమె విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేసి ఇప్పటికీ నిరుద్యోగభృతి కల్పించడం లేదు. కరోనా సమయంలో పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. నర్సు ఉద్యోగాలను ఖాళీగా ఉన్నాయని నర్సులను తీసుకొని నేడు వాళ్ళని తొలగించడం అసంబద్ధమైనది. తొలగించిన నర్సులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని మహిళా మోర్చా రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది.