పరస్పరం అవినీతి కప్పిపుచ్చుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ 

పరస్పరం అవినీతి కప్పిపుచ్చుకుంటున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ 
 
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఇరు పార్టీల్లో నాయకులు ఒకరికొకరు అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణకు కోరాలని, ఫార్ములా-ఈ రేస్ లో అవినీతిపై పారదర్శకంగా విచారణ చేయాలని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.

సిద్దిపేటలో జరిగిన రెండు రోజుల ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతులు’ (శిక్షణా తరగతులు) ముగింపు సమావేశంలో పాల్గొంటూ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ అవినీతికి ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడిన తెలంగాణలో నేడు నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొంటూ జాబ్ క్యాలెండర్ ఏదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బిజెపిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. 
ఎస్‌ఐఆర్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఒక సాధారణ మరియు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని,  రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దీనిని బిజెపికి ఆపాదించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. ఇది 2002లో కూడా జరిగిందని, అప్పట్లో దీనిని ఎవరూ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు.
ఎస్‌ఐఆర్ ఉద్దేశ్యం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, పకడ్బందీగా సిద్ధం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రతి నిజమైన ఓటరుకు తాము నివసించే చోట ఓటు వేసే హక్కు ఉందని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొలగించబడదని ఆయన భరోసా ఇచ్చారు. తమ ఓటును తాము పనిచేసే లేదా నివసించే ప్రాంతానికి మార్చుకుంటే ఆస్తి హక్కులు పోతాయని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద, ఇప్పుడు ఎస్‌ఐఆర్ మీద నిందలు వేస్తున్నాయని చెబుతూ ఇవన్నీ కేవలం రాజకీయ డ్రామాలేనని ఆయన ఎద్దేవా చేశారు.మరోవైపు రైతుల ధాన్యం కొనుగోలులో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడాని ప్రధాని మోదీ గారిని నిందించడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బిజెపికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ, తెలంగాణలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ను తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.బిజెపి “నేషన్ ఫస్ట్” అని నమ్ముతుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మాత్రం అధికారం-అవినీతే ప్రధానమని ఆయన ఆరోపించారు.