చిక్కుల్లో వినోద్ కుమార్ నామినేషన్

కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. తనది కాని భూమి తన పేరు మీడు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై దుమారం రేగుతోంది. వినోద్ కుమార్ స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు. ఈ ఊరిలో ఆయనకు భూమి ఉంది.  ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన అఫిడవిట్ లో పొందుపరిచారు.
సర్వే నంబర్ 286/ఏ, 282/బీ, 273/ఏ, 272/బీ, 275/ఏ, 274, 174, 175/ఏ, 251/బీ, 280/ఏ, 306, 307లో 11.06 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే సర్వే నంబర్ 251/బీ లో వినోద్ కుమార్ కుటుంబానికి భూమి లేదు.  ఈ సర్వే నంబర్ పై అదే గ్రామానికి చెందిన పెద్ద సాంబయ్యకు 14 గుంటల భూమి ఉన్నట్లు ధరణిలో కనిపిస్తోంది. అంతేకాకుండా ఆ ఊరిలో 286 సర్వే మాత్రమే ఉంది.
ఈ సర్వే నంబర్ లో నల్లపు నాగలక్ష్మికి భూమి ఉంది. కానీ వినోద్ కుమార్ సమర్పించిన అఫిడవిట్ లో 286/ఏలో భూమి ఉన్నట్లు పొందుపరిచారు. అయితే ఈ సర్వే నంబర్ ధరణిలోనే లేదు. అటు వినోద్ కుమార్ తండ్రి పేరుపై అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి వినోద్ కుమార్ తండ్రి పేరు పై ఉంది. ఏనుగల్లులో సర్వే నంబర్ 175/4 లో 25 గుంటలు, 175/ఏ/4/1లో 25 గుంటల అసైన్డ్ భూమి వినోద్ కుమార్ తండ్రి మురళీధర్ రావు పేరుపై ఉంది. 
 
తప్పుడు సమచారం ఇచ్చి ఎన్నికల అధికారులను వినోద్ కుమార్ రావు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎన్నికల సంఘానికి ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. వినోద్ కుమార్ తన భార్య మాధవి పేరిట ఆస్తుల వివరాలు కూడా సరిగా ఇవ్వలేదని తెలుస్తోంది.  మాధవి పేరుపై 15 గుంటల భూమి ఎక్కువగా చూపినట్లు ఉంది. దీనిపై వినోద్ కుమార్ ఇంతవరకు స్పందించలేదు. గతంలో కూడా వినోద్ కుమార్ తన బంధువుల మహిళకు అక్రమంగా విద్యుత్ శాఖలో గెజిటెడ్ స్థాయి పోస్ట్ ఇప్పించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను వినోద్ కుమార్ ఖండించారు.