రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం

రెండు లక్షల రుణ మాఫీతో సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తే తాను కూడా రాజీనామాకు సిద్దమని బిజెఎల్‌పి నేత మ హేశ్వర్ రెడ్డి సవాలు చేశారు. రాజీనామాలపై బి ఆర్‌ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. 

ఆగష్టు 15 లోపు రైతులకు రూ. 2 లక్ష ల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుండగానే బిజెఎల్‌పి నేత మహేశ్వర్ రెడ్డి ఇందులో ప్రవేశించారు. 

తాజాగా మహేశ్వర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం రాజకీయాలను వెడెక్కిస్తోంది. కేవలం రూ.2 లక్షల రుణమాఫీపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు, మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేరిస్తే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసేందుకు తాను కూడా సిద్ధమని ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్ట్ 15 లోపు అన్ని హామీలు నేరవేరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ చేసుడు కాదు, ఆరు గ్యారెంటీలను టచ్‌ చేసి ప్రజలకు అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను రేవంత్‌ రెడ్డి అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని చెప్పారు. రాజీనామా లేఖతో తాను గన్‌పార్కు వద్దకు వెళ్తే, అక్కడకు రాకుండా సీఎం రేవంత్‌ రెడ్డి డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు.